వైసీపీలోకి సినీనటుడు అలీ..ముహూర్తం ఫిక్స్!
రాజకీయ చదరంగం లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నిజమే దానికి ఇదే మంచి ఉదాహరణ అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు…

హైదరాబాద్: సినీనటుడు అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గత నెల 28న ఓ ఎయిర్‌పోర్టులో జగన్, అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు జగన్ సమక్షంలో అలీ చేరనున్నారు. అదే విధంగా పార్టీ ఆదేసిస్తే పోటీకి కూడా తాను సిద్దమంటూ అలీ చెబుతున్నారు. మరోపక్క పవన్‌కు సన్నిహితుడిగా పేరున్న అలీ వైసీపీలోకి వెళ్తుండటంపై జనసేన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమన్న బండ్ల గణేష్ కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి పవన్ అభిమానులను షాక్‌కు గురిచేశారు. ఇప్పుడు మరోమారు పవన్‌కు ఆప్తుడైన అలీ..పవన్ నిత్యం విమర్శించే జగన్ పార్టీలో చేరడంతో పవన్ అభిమానులు మరోమారు షాక్ అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన అలీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా కేవలం ప్రచారానికే పరిమితమవుతారా అన్నది వేచి చూడాలి.