లోక్‌సభ స్థానాలన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే
రాహుల్ ప్రధాని కావడం ఖాయం: ఉత్తమ్

ఈరోజుటీవి /మేళ్లచెర్వు రూరల్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించామని, ఇప్పుడు 22%కు తగ్గించడం బాధాకరమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హుజూర్‌నగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. తన నియోజకవర్గంలో గతంలో వేల కోట్ల రూపాయలతో రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, సాగు, తాగునీటి పథకాలు, మట్టపల్లి బ్రిడ్జి, డిగ్రీ కళాశాల, 100 పడకల ఆస్పత్రి, మోడల్ స్కూల్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నిధులు మంజూరై మిగిలిపోయిన పనులను, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పులిచింతల ముంపు బాధితుల పునరావాస కేంద్రాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం త్వరలో గ్రామ, మండల సమన్వయ కమిటీలు వేస్తానన్నారు. సర్పంచ్ అభ్యర్థులను ఈ కమిటీలు ఎంపిక చేయాలని సూచించారు.