చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు: కేసీఆర్
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
ఈ దఫాలోనే ఎత్తిపోతల పథకాలు పూర్తి: సీఎం కేసీఆర్

ఈరోజుటీవి /హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలకు ఇప్పటి వరకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించినట్లుగానే.. ఇకపై చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యాన్ని కొనసాగిస్త్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, వైద్య శిబిరాల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నదని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు.
కంటి వెలుగు శిబిరాల మాదిరిగానే ప్రజలందరికీ చెవి, గొంతు, ముక్కు, దంత పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించాలని, ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, దాని ఆధారంగా ‘తెలంగాణ ఆరోగ్య స్థాయి’ని తయారు చేయాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లాంటి ఎత్తి పోతల పథకాలన్నీ ఈ దఫాలో పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే బడ్జెట్లోనూ నీటి పారుదల శాఖకు సముచిత రీతిలో నిధులు కేటాయించడంతో పాటు.. ఇతరత్రా మార్గాల ద్వారా నిధుల సేకరణ జరుపుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.