Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రవాసి భారతీయ దివస్ నిర్వహణ తేదీని మార్చడం మహాత్మా గాంధీని అవమానించడమే ?

దాచిన చిత్రం

ప్రవాసుల మనసులను గాయపర్చిన బిజెపి….అటల్ బిహారీ వాజపేయి నిర్ణయాన్ని అపహాస్యం చేసిన నరేంద్ర మోదీ…బిజెపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 9న ‘ఆమ్ ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహిస్తాము.

9 జనవరి 1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి భారత్ కు తిరిగి వచ్చి స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన మాతృదేశానికి తిరిగి వచ్చిన రోజు చారిత్రాత్మక ప్రాధాన్యతను పురస్కరించుకుని 9 జనవరి 2003 రోజున మొదటిసారిగా ఢిల్లీలో ‘ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహించారు.

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని కాదని బిజెపి ప్రభుత్వం ఈసారి 2019 జనవరి 9వ తేదీకి బదులు 23వ తేదీన వారణాసిలో ‘ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహిస్తున్నది. నిర్వహణ తేదీని మార్చడం జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమేనని టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి మంద భీంరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం నాయకులు గురువారం 27న గాంధీ భవన్ లో విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

డా. ఎల్.ఎం. సింఘ్వి నేతృత్వంలో ప్రవాస భారతీయులపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు ఆధారంగా ‘ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహించాలని 2002 లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా దేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను గుర్తుచేసుకుంటూ, పలురంగాల్లో విశేష కృషిచేసిన వారికి ప్రతిష్టాత్మక ‘ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు’ తో సత్కరిస్తారు. 1915లో మహాత్ముడు దక్షిణాఫ్రికా నుండి మాతృభూమికి తిరిగి వచ్చి, భారతమాత దాస్య శృంఖలాలను తొలగించటానికి నడుం కట్టిన సందర్భాన్ని, తేదీని పురస్కరించుకుని గత దశాబ్ద కాలంకుపైగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రవాసి భారతీయ దివస్’ అనే సదస్సు స్వరూపాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది.

2003 నుండి 2015 వరకు 13 సంవత్సరాలపాటు ప్రతి ఏటా నిర్వహించిన ‘ప్రవాస భారతీయ దివస్’ ను రెండేళ్లకోసారి నిర్వహించాలని 2015లో బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2016, 2018 లలో ‘ప్రవాస భారతీయ దివస్’ ను నిర్వహించకుండా ఢిల్లీలో చిన్నపాటి సమావేశంగా నిర్వహించారు. ఈసారి 2019 లో ఏకంగా తేదీనే మార్చేశారు.

జనవరి 9న ‘ఆమ్ ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహిస్తాము

బిజెపి ప్రవాసీ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి, మహాత్మా గాంధీని స్మరించుకోవడానికి వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరి 9న ‘ఆమ్ ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 23 కు పైగా పథకాల పేర్లను బిజెపి ప్రభుత్వం మార్పుచేసిందని, గాంధీ, నెహ్రూ కుటుంబాలతోపాటు, ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకుల పేర్ల ప్రాధాన్యం తగ్గించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని వారు విమర్శించారు.

Please follow and like us:

You may also like...