ఘన స్వాగతం తో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు…?

ఈరోజుటీవి/విశాఖపట్టణం/సిటీ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖ పట్టణానికి చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీ సంతోష్, తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి.. సాదరంగా వీడ్కోలు పలికారు. విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు.