Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

విలీనక్రీడ…విలువలకు పీడ!

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌ వాంఛించే గుణాత్మక మార్పు అంటే అనైతికంగా, చట్టవిరుద్ధంగా పార్టీలను విలీనం చేసుకోవడమా? ప్రతిపక్షాలు లేని చట్టసభలు ఉప్పూ–కారం లేని కూరవంటివి. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పడంలో అధికారపక్షానికి లభించే మజా ప్రతిపక్షం లేకుండా చేసుకుంటున్న కేసీఆర్‌కు ఎలా లభిస్తుంది? అధికార పక్షం మాత్రమే ఉండే సభలు ఏమి రక్తి కట్టించగలవు? కాంగ్రెస్‌పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్టవిరుద్ధ చర్య ద్వారా కేసీఆర్‌ తన ఔన్నత్యాన్ని తానే తగ్గించుకున్నారు. తాజాగా సాధించిన ఘన విజయంతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తాను చేసిన పనికి ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఇలాంటి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని పెంచేవి కావు. అవసరం లేకపోయినా విలీనాలు అనే కపట నాటకానికి తెర ఎందుకు తీసినట్టు? అనే ప్రశ్నకు కేసీఆర్‌ను అభిమానించే వాళ్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు తన చర్యను ఆయన ఎలా సమర్థించుకుంటారు?

చట్ట సభల స్పీకర్‌లు ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వారు అస్వతంత్రులుగా, మరబొమ్మలుగా మారిపోయారని అనేది రాజకీయ విశ్లేషకుల మాట. టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇవ్వాళో రేపో చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ న్యాయ నిపుణుడి సలహా ప్రకారం, ఏ చట్టం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారో? అయినా, శాసనమండలి చైర్మన్‌ మాత్రం ఏమి చేయగలరు? మరొకరకంగా వ్యవహరిస్తే, ఆయన స్థానంలో మరొకరు చైర్మన్‌గా రావచ్చు!

మీడియా ఎలా వ్యవహరించాలో ఇటీవల కేసీఆర్‌ కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన కేటీఆర్‌ సుదీర్ఘంగా వివరించారు. దీన్నిబట్టి ఇకపై తెలంగాణలో ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ, మరెవరైనా గానీ బతికి బట్టకట్టాలంటే అధికార పార్టీకి గులాంగిరీ చేయాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో అలా కావాలనుకోవడమే ఒక పొరపాటు ఆలోచన! చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఇలాంటి ధోరణులను సహించగలదా?

తాను చేస్తున్నదే రైటు అనుకునేవారిని ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఏమి చెప్పగలరు? తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా మండలి కార్యదర్శి పేరిట శుక్రవారంనాడు విడుదలైన ప్రకటనను చూసిన తరవాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలిలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దురాశతో పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చట్టాలు సమర్థిస్తాయా? అంటే లేదని కచ్చితంగా చెప్పవచ్చు. అయినా అలా ఎలా చేశారు? అధికారం ఉందన్న అహంభావంతో చేసే పనులు దీర్ఘకాలంలో వికటించక మానవు. దేశ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులనే ప్రహసనం పోయి, ఇప్పుడు పార్టీల విలీనం అనే వికృత క్రీడ కూడా మొదలైంది. తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకున్న పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులలో అత్యధికులను ప్రజలు మళ్లీ గెలిపించారు. దీంతో తాము ఏమి చేసినా చెల్లుతుందన్న భావన పాలకుల్లో ఏర్పడకుండా ఎందుకు ఉంటుంది? అందుకే ఇప్పుడు ఏకంగా పార్టీలనే విలీనం చేసుకుంటున్నారు. నిజానికి పార్టీలలో చీలికల వ్యవహారాన్నీ, విలీనాలనూ తేల్చవలసింది ఎన్నికల కమిషనే కానీ చట్టసభల స్పీకర్లు కాదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు ఆ ప్రక్రియను ఎన్నికల కమిషనే గుర్తించింది.

1995లో తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీనే అసలైన పార్టీగా ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. ఇది గతం. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ అధికారాలను కూడా చట్టసభల స్పీకర్లే దఖలుపరచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు.. ప్రశ్నించే గొంతు వినపడకూడదన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయంగా కనిపిస్తున్నది. రాజకీయంగా ప్రత్యర్థి పక్షాలను దెబ్బతీయాలనుకోవడం తప్పు కాదు. అయితే అది ప్రజాక్షేత్రంలోనే జరగాలి. ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రత్యర్థులను అనైతికంగా, చట్టవిరుద్ధంగా విలీనం చేసుకోవడం వల్ల బలం పెరిగిందనుకోవడం భ్రమే అవుతుంది. అలాంటి బలం స్టెరాయిడ్స్‌ తీసుకోవడం వల్ల పెరిగే కండల వంటిది. స్టెరాయిడ్స్‌ ప్రభావం తగ్గగానే కండలు కూడా కరిగిపోతాయి. తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు బొటాబొటీ మెజారిటీ మాత్రమే వచ్చింది. దీంతో తెలంగాణపై జరుగుతున్న కుట్రలో భాగంగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. వచ్చిన తెలంగాణ ఎక్కడ పోతుందోనన్న భయంతో అప్పుడు కేసీఆర్‌ చెప్పిన మాటలను ప్రజలు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు మళ్లీ ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నకు కేసీఆర్‌ సమాధానం చెప్పవలసి ఉంటుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో కేసీఆర్‌కు ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ తిరుగులేని శక్తి. తెలంగాణ అస్తిత్వానికి వచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థితిలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. పరాజయ భారం నుంచి ప్రతిపక్షాలు ఇంకా కోలుకోలేదు. కేసీఆర్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు కేసీఆర్‌ ఇవ్వాళ కాకపోయినా రేపైనా సమాధానం చెప్పవలసి వస్తుంది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌ వాంఛించే గుణాత్మక మార్పు అంటే అనైతికంగా, చట్టవిరుద్ధంగా పార్టీలను విలీనం చేసుకోవడమా? ప్రతిపక్షాలు లేని చట్టసభలు ఉప్పూ–కారం లేని కూర వంటివి. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పడంలో అధికారపక్షానికి లభించే మజా ప్రతిపక్షం లేకుండా చేసుకుంటున్న కేసీఆర్‌కు ఎలా లభిస్తుంది? అధికార పక్షం మాత్రమే ఉండే సభలు ఏమి రక్తి కట్టించగలవు? ఇప్పుడు కేసీఆర్‌ అనుసరిస్తున్న ధోరణి తెలంగాణలోని ఊళ్లల్లో పెత్తందార్ల వైఖరిని గుర్తుకు తెస్తోంది. బలహీనులు తమను కన్నెత్తి చూడటమే నేరంగా పెత్తందార్లు భావించేవారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అలాగే తనను చట్టసభల లోపల, వెలువల కూడా ఎవరూ ప్రశ్నించకూడదని కోరుకుంటున్నట్టు ఉంది. మీడియా ఎలా వ్యవహరించాలో ఇటీవల కేసీఆర్‌ కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన కేటీఆర్‌ సుదీర్ఘంగా వివరించారు. దీన్నిబట్టి ఇకపై తెలంగాణలో ప్రతిపక్షాలు గానీ, మీడియా గానీ, మరెవరైనా గానీ బతికి బట్టకట్టాలంటే అధికార పార్టీకి గులాంగిరీ చేయాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో అలా కావాలనుకోవడమే ఒక పొరపాటు ఆలోచన! చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఇలాంటి ధోరణులను సహించగలదా? నిజాం ప్రభువులనే ఎదిరించిన గడ్డ ఇది!

గతాన్ని మరిస్తే…
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మెప్పు పొందినవారే అధికారంలోకి వస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్‌ కూడా తన నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల మెప్పు పొంది తాజాగా జరిగిన ఎన్నికలలో భారీ విజయం సాధించారు. పురాణాలలో బోళా శంకరుడి వరాలు పొందిన కొందరు తిరుగులేని శక్తులుగా అవతరించారు. శివుడు ఇచ్చిన వరంతో పొందిన ఆ బలాన్ని సత్కార్యాలకు ఉపయోగించకపోగా అనైతిక, ధర్మ విరుద్ధ చర్యలకు పాల్పడి చివరకు ప్రతినాయకులుగా ముద్ర పడ్డారు. వర్తమానంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి బోళాశంకరులైన ప్రజలను మెప్పించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. విజయంతోపాటు వినయాన్ని అలవరచుకోవాలని తాను చెప్పిన మాటలనే విస్మరించి, ప్రతిపక్షాలను కబళించే పనిని కేసీఆర్‌ ఇప్పుడు చేపట్టారు. తెలంగాణలో కేసీఆర్‌ అత్యంత శక్తిమంతుడిగా నిలబడటానికి ప్రజలు ఇచ్చిన వరమే కారణం గానీ మరొకటి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవ్వాళ అత్యంత బలవంతులుగా కనిపించేవాళ్లు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి బలహీనపడిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సమీప భవిష్యత్తులో తిరుగు ఉండదు అని అందరూ భావించారు. నాలుగేళ్లు తిరిగేసరికి సీన్‌ రివర్స్‌ అయ్యింది.

బిహార్‌లో అతి చిన్న పార్టీ నాయకుడైన రాంవిలాస్‌ పాశ్వాన్‌ను మచ్చిక చేసుకోవడానికి మోదీ, అమిత్‌ షా ద్వయం ఎలా వెంపర్లాడుతున్నదో ఇప్పుడు చూస్తున్నాం. మోదీ దెబ్బకు కాంగ్రెస్‌ బతికి బట్టకట్టగలదా? ఆ పార్టీకి మళ్లీ పునర్‌వైభవం సాధ్యమేనా? అని సందేహపడినవాళ్లు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే మోదీ– షా ద్వయం ఇటీవల వరకు ప్రాంతీయ పార్టీలను కూడా కబళించాలని చూశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకున్నారు. ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడం ఎలా? అని తలలు పట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రాజీవ్‌గాంధీ అయిదేళ్లు గడిచేసరికి అధికారం కోల్పోయారు. 1984లో ఎన్టీఆర్‌ను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని భావించిన ప్రజలు అప్పుడు జరిగిన ఎన్నికలలో ఆయనకు భారీ మెజారిటీని అందించారు. అదే ఎన్టీఆర్‌ 1989లో ఓడిపోయారు.

ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులపై నిరసనగళం వినిపించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకుపోవడాన్ని తిట్టిపోశారు. ఉప ఎన్నికలలో ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ను తిరస్కరించడంతో కేసీఆర్‌ కంటతడి పెట్టడాన్ని ఆయన మరిచిపోయారేమో గానీ ప్రజలు మరిచిపోలేదు. గతాన్ని మర్చిపోయేవారికి భవిష్యత్‌ ఉండదంటారు. తాజా ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన మద్దతుతో తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలను చీల్చాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్న తెలంగాణ సమాజాన్ని వేధించకుండా ఉండదు. కాంగ్రెస్‌పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్టవిరుద్ధ చర్య ద్వారా కేసీఆర్‌ తన ఔన్నత్యాన్ని తానే తగ్గించుకున్నారు. తాజాగా సాధించిన ఘన విజయంతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తాను చేసిన పనికి ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఇలాంటి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని పెంచేవి కావు. అవసరం లేకపోయినా విలీనాలు అనే కపట నాటకానికి తెర ఎందుకు తీసినట్టు? అనే ప్రశ్నకు కేసీఆర్‌ను అభిమానించే వాళ్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు తన చర్యను ఆయన ఎలా సమర్థించుకుంటారు? అయినా మన బంగారం మంచిదైతే అనే సామెత పార్టీ ఫిరాయించేవారికి వర్తిస్తుంది.

తాజా ఎన్నికలలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఆకుల లలిత తన చర్యను సమర్థించుకోవడానికి చేసిన వాదన వింతగా ఉంది. తనకు ఓటేసుకున్న ఆమె చేతివేలిపై సిరా గుర్తు కూడా ఇంకా చెరిగిపోలేదు. ఇంతలోనే ఆమె పార్టీ మారడానికి సిద్ధపడ్డారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నందున తాను కూడా ప్రజలవైపే ఉండాలనుకుంటున్నట్టు ఆమె సెలవిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమెను సమర్థించి ఓటేసిన వాళ్లు ఏమైపోవాలి? ఇంతటి వేవ్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా 50 శాతం పైగా ప్రజలు నిలబడ్డారు. మరి వాళ్లు ప్రజలు కాదా? రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో అన్ని పార్టీలకూ వాటా ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చట్టాలను చట్టు బండలు చేస్తున్నారు. ఇప్పుడు బాధితపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ కూడా గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపం మూటగట్టుకుంది. ప్రధానమంత్రిగా పనిచేసి.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు కూడా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జేఎంఎం ఎంపీలకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తెలుగుదేశం ఎంపీలను లోబర్చుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పలు రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహించింది. విచిత్రం ఏమిటంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది ఈ పార్టీలే! తాము తెచ్చిన చట్టానికి తామే తూట్లు పొడవటాన్ని రాజకీయ పార్టీలు ఎలా సమర్థించుకోగలవు? ఇప్పుడు కేసీఆర్‌ ఇంకో అడుగు ముందుకు వేసి ఏకంగా ప్రత్యర్థి పార్టీలను విలీనం చేసుకుంటున్నారు. చట్టసభల స్పీకర్‌లు ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వారు అస్వతంత్రులుగా, మరబొమ్మలుగా మారిపోయారు.

తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారిపై చర్య తీసుకోండి బాబూ అని ప్రతిపక్షాలు మొత్తుకున్నా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతున్నారు. అదే అధికారపక్షం నుంచి అటువంటి అభ్యర్థనలు వస్తే మాత్రం ఆగమేఘాల మీద నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌నే తీసుకుందాం. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవలసిందిగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిటిషన్‌ను ఆయన చాలా కాలంగా పరిశీలిస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి రెండు రోజుల క్రితం ఇటువంటి అభ్యర్థన రాగానే నోటీసులు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇవ్వాళో రేపో చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ న్యాయ నిపుణుడి సలహా ప్రకారం, ఏ చట్టం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారో? అయినా, శాసనమండలి చైర్మన్‌ మాత్రం ఏమి చేయగలరు? మరొకరకంగా వ్యవహరిస్తే, ఆయన స్థానంలో మరొకరు చైర్మన్‌గా రావచ్చు!

ప్రకృతి ధర్మానికీ విరుద్ధమే!
గతంలో శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినప్పుడు ఇంతలా అభ్యంతరాలు వ్యక్తంకాలేదు. 119 సభ్యుల సభలో 90 మంది బలం ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఇటువంటి అనైతిక, చట్టవిరుద్ధ చర్యకు పాల్పడవలసిన అవసరం ఏమిటి? అని పలువురి నుంచి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 40 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో ప్రతిపక్షాల నుంచి పట్టుమని పది మంది కూడా లేరు. అయినా వారు కూడా ఉండకూడదనుకోవడాన్ని ఎలాంటి మనస్తత్వం అనుకోవాలి? విలీనం అనే వికృత క్రీడకు పాల్పడకపోయినా ఈ టర్మ్‌ పూర్తయ్యే లోపే మండలిలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్థానం అయ్యేది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉండకూడదు… ఎదురుచెప్పే మీడియా ఉండకూడదు.

టీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణలో ఉండాలి. మిత్రపక్షంగా ఉన్నందున ఎంఐఎం కూడా కొనసాగవచ్చు. ఈ రెండు పార్టీలు మినహా మరే పార్టీకీ తెలంగాణలో తావు లేదని చెప్పడమే కేసీఆర్‌ అభిమతం కావచ్చు. ప్రతిపక్షం లేని చట్టసభలు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే! గతంలో జరిగిన ఒక ఉదంతాన్ని ఇక్కడ చెప్పుకొందాం. ఇప్పుడు రాజ్యసభలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మెజారిటీ లేనట్టుగానే, ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలిలో ప్రతిపక్షాల సంఖ్య అధికారపక్షం కంటే ఎక్కువగా ఉండేది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కు చికాకులు ఎదురయ్యేవి. ఆ తరుణంలో సభాహక్కుల ఉల్లంఘన కేసు వచ్చి పడింది. తమను అవమానించే విధంగా శీర్షిక పెట్టారన్న కోపంతో ప్రతిపక్ష సభ్యులు ‘ఈనాడు’ పత్రిక అధిపతి రామోజీరావును సభకు పిలిపించాలని నిర్ణయించారు. దీనిపై ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయినా ప్రతిపక్షాలు శాంతించకుండా రామోజీరావును అరెస్ట్‌ చేసి తీసుకురావలసిందిగా పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాయి. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు శాసనమండలి ఆదేశాలతో పోలీసులు నలిగిపోయారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్‌ ఏకంగా శాసనమండలినే రద్దు చేసి పారేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇలాంటి చికాకులు ఏమీ లేవు. తెలంగాణనే ఆయన సొంతం అయిపోయింది.

వ్యవస్థలన్నీ జీ హుజూర్‌ అనే పరిస్థితి! అంతులేని అధికారం కేసీఆర్‌ సొంతం. అయినా ఆయన తృప్తిపడటం లేదు ఎందుకో? తెలంగాణ అనే తన సామ్రాజ్యంలో తన పార్టీతో పాటు మజ్లిస్‌ పార్టీ మాత్రమే ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది కదా! ఇలా ఆలోచించడం ప్రజాస్వామ్య సూత్రాలకే కాదు ప్రకృతి ధర్మానికి కూడా విరుద్ధం! ఇవ్వాళ కేసీఆర్‌ ఇంతటి శక్తిమంతుడిగా ఉన్నారంటే అందుకు ప్రజలు ఇచ్చిన వరమే కారణం. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే సాహసం జాతీయ రాజకీయాలలో కూడా రాణించాలనుకుంటున్న కేసీఆర్‌కు మంచిది కాదు. శాసన సభను, శాసనమండలిని టీఆర్‌ఎస్‌ సభ్యులతో నింపాలనుకోవడం సమర్థనీయం కాదు. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కేసీఆర్‌కు ఇవేవీ తెలియదనుకోలేం. అయినా ప్రతిపక్షాలు లేని, ప్రశ్నించే గొంతులు లేని తెలంగాణ సమాజం కావాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారో తెలియదు. జనరంజక పాలన అందిస్తూ, ప్రశ్నించే వారికి ప్రశ్నించే అవకాశం లేకుండా చేసుకోవాలి. విమర్శించడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసుకోవాలే గానీ ‘నేను మాత్రమే’ అని భావించడం తప్పు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీని విలీనం చేసుకోవడం అనే చట్టవిరుద్ధ చర్యను న్యాయస్థానాలైనా అడ్డుకుంటాయని ఆశిద్దాం. ఎందుకంటే పురాణాలలో వరమిచ్చిన శివుడు నిస్సహాయుడైనప్పుడు మహా విష్ణువు పూనుకుని పరిస్థితులను చక్కదిద్దాడు. అదుపు తప్పిన వ్యవస్థలను అదుపులో పెట్టడానికి మనకు రాజ్యాంగంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి. చైతన్యం లేని సమాజం, వ్యవస్థలు జీవచ్ఛవంతో సమానం. ఇవ్వాళ కేసీఆర్‌ ప్రారంభించిన ఈ క్రీడను రేపు మరొకరు ఇంతకంటే వికృతంగా ఆడరన్న గ్యారంటీ లేదు కనుక ఇలాంటి పోకడలను అడ్డుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. తెలంగాణలో షాక్‌ కొట్టింది కాంగ్రెస్‌ పార్టీకి కాదు.. ప్రజాస్వామ్యానికి అని కొందరు రాజకీయ విశ్లేషకుల తో పాటు, కొన్ని రాజకీయ పక్షాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతుండటం గమనార్హం. 

Please follow and like us:

You may also like...