Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నాయిని మాజీ అయిపోయినట్లేనా… డిప్యూటీ స్పీక‌ర్‌గా విన‌య్ భాస్కర్‌?

తెలంగాణ కేబినెట్‌లో ఎంత‌మంది పాత మంత్రుల‌కు చోటు ద‌క్కనుంది? మంత్రి వ‌ర్గంలో స్థానం క‌ల్పించినా, పాత శాఖ‌ల మార్పులు త‌ప్పాదా?

గ‌త ప‌నితీరు ఆధారంగానే కొత్త మంత్రి వ‌ర్గంలో కొంత మందికి కీల‌క శాఖ‌లు ద‌క్కనున్నాయా? స్పీక‌ర్ పీఠం ఎవ‌రికి ద‌క్కేను?

డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎవ‌రు ఉండబోతున్నారు? ఇప్పుడివే ప్రశ్నలపై టీఆర్‌ఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి ఘ‌న విజ‌యం సాధించిన టీఆర్‌ఎస్‌ మ‌ళ్లీ అధికారాన్ని చేప‌ట్టింది. రెండోసారి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణం స్వీకారం చేశారు. కేసిఆర్‌తో పాటు కేవ‌లం మ‌హ‌మూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌డం.. ఆయ‌న‌కు హోం శాఖ‌ను కేటాయించ‌డం జ‌రిగింది. ఇంకా మిగిలిన 16మంది మంత్రుల‌ను త్వర‌లోనే నియ‌మించ‌నున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్పుడు ఎవ‌రా 16మంది అనేదానిపైనే చ‌ర్చ సాగుతోంది. అయితే గ‌త కేబినెట్‌లో ఉన్న వారిలో ప‌ది మందికి ఈసారి కూడా మంత్రి ప‌ద‌వులు ఖాయమని ప్రచారం జరుగుతోంది. పాత కేబినెట్‌లోని తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ , స్పీక‌ర్‌గా ప‌నిచేసిన మధుసూదనచారి ఓటమి పాలయ్యారు. దీంతో కొత్త వారికి కేబినేట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు గ‌త కేబినెట్‌లో పని చేసి తాజాగా గెలిచిన కొందరు మంత్రులకు కూడా ఈ సారి స్థానం లేద‌ని తెలుస్తోంది.

ఇక గెలిచిన మంత్రుల్లో హరీష్‌రావు, కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పద్మారావు ఉన్నారు. వీరిలో ఎవరికి మళ్లీ అవకాశం దక్కొచ్చన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీరితోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రులుగా ఉన్నవారు కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి ఉన్నారు. మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చిన తర్వాత ఇక నాయిని మాజీ మంత్రి అయిపోయినట్లే అంటున్నారు. నాయిని నర్సింహారెడ్డికి కొత్త కేబినెట్‌లో చాన్స్ లేనట్లే అని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక కడియం శ్రీహరిని తిరిగి కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతుంది. అలాగే గత టర్మ్ మంత్రుల్లో జగదీష్ రెడ్డికి, పద్మారావు, జోగు రామన్నకు కూడా మంత్రి పదవులు అనుమానమే అంటున్నారు.

ఇరిగేష‌న్ శాఖ మంత్రిగా అహ‌ర్నిశ‌లు కృషి చేసి ప్రాజెక్టుల నిర్మాణంలో హరీష్‌ రావు కీలకంగా పని చేశారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ఇది కూడా ప్రధాన కార‌ణం. మళ్లీ హ‌రీష్ రావుకు ఇరిగేష‌న్ శాఖ ఉంటుందా లేదా అనే చ‌ర్చ నడుస్తోంది. ఇక కేటీఆర్‌ ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు పార్టీకి సంబంధించి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్కడంతో ఈ సారి కేటీఆర్‌కు ఏ ఏ శాఖ‌లుండ‌బోతున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రో కీల‌క‌మైన‌ది ఆర్ధిక శాఖ‌. గత నాలుగేళ్లు ఈటెల రాజేంద‌ర్ ఫెర్ఫామెన్స్ బాగానే ఉన్నా….ఈ సారి మ‌ళ్లీ ఆర్థిక శాఖ ఆయనకు ద‌క్కుతుందా అనేది సందేహమే. దేవాదాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన ఇంద్రక‌ర‌ణ్ రెడ్డికి, అట‌వీశాఖ మంత్రిగా ప‌నిచేసిన జోగు రామ‌న్నకు ఇద్దరిలో ఒక్కరికే బెర్త్ ద‌క్కనున్నట్టు తెలుస్తోంది. త‌ల‌సానికి మంత్రి ప‌దవి గ్యారెంటీ అని తేలింది.

కొత్తగా గెలిచిన వారిలో కొందరికి మంత్రి పదవులు ఇప్పటికే ఖాయ‌మైనట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో కొప్పుల ఈశ్వర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిరంజన్ రెడ్డి, దానం నాగేందర్, ఆరూరి రమేష్, రేఖా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. కాబ‌ట్టి గ‌త‌ మంత్రి వ‌ర్గంలో ఉన్న వారిలో ఒక‌రిద్దరికి ఈ సారి కూడా పాత శాఖలు మిన‌హా…మిగిలిన వారంద‌రికి కొత్త శాఖలు ఇవ్వనున్నట్టు స‌మాచారం. మంత్రుల సంగతి అటుంచితే…స్పీక‌ర్ , డిప్యూటీ స్పీక‌ర్ ఎవ‌ర‌నేది తేలాల్సి ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కానీ, రెడ్యా నాయ‌క్‌కు గానీ స్పీక‌ర్ పదవి ద‌క్కనున్నట్టు ప్రచారం. ఒక‌వేళ పోచారంకు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే… దాస్యం విన‌య్ భాస్కర్‌కు డిప్యూటీ స్పీక‌ర్ ఇస్తార‌ని పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి కొత్త, పాత కలయికతో తెలంగాణ కేబినేట్‌ కూర్పు ఉండబోతోంది.

Please follow and like us:

You may also like...