Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎన్నికలంతా కకావికలం ?

కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారు
కౌంటింగ్‌ మధ్యలో పోలీసుల హంగామా
మా ఏజెంట్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారు
సెల్‌ఫోన్‌తో కౌంటింగ్‌కు మంచిరెడ్డి తనయుడు
ఇబ్రహీంపట్నంలో రీకౌంటింగ్‌ నిర్వహించాలి
బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్‌
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి.

తొర్రూర్‌ పరిధిలోని 204 పోలింగ్‌ స్టేషన్లో 970 ఓట్లు పోలయ్యాయి. ఇదే విషయాన్ని ఫామ్‌ 17 సీలో అధికారులు ధ్రువీకరించారు. కానీ, ఇక్కడ కౌంటింగ్‌లో 758 ఓట్లు మాత్రమే లెక్కించారు. పోలింగ్‌ బూత్‌ 273లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ధ్రువీకరిస్తూ.. ఫామ్‌ 17సీ ఇవ్వలేదు. ఇక్కడి ఓట్ల కౌంటింగ్‌ జరుగుతుండగా పోలీసులు వచ్చి హంగామా చేశారు. ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేశారు. మా ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంచిరెడ్డి కిషన్‌ రెడ్డికి లబ్ధి చేకూర్చడానికి దురుసుగా ప్రవర్తించారు. 20వ రౌండ్‌లో నేను 751 ఓట్ల మెజారిటీతో ఉన్నాను. కానీ, ఇదే సమయంలో సరైన కారణం లేకుండానే సిబ్బంది కౌంటింగ్‌ నిలిపివేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి.

కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులివి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కౌంటింగ్‌ సందర్భంగా పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, ఇక్కడ రీకౌంటింగ్‌ నిర్వహించాలని కోరారు. వీవీప్యాట్లు అన్నిటినీ లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అలాగే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. తమ నియోజకవర్గంలో కౌంటింగ్‌ అక్రమాలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈసీకి అందించారు. ఇక్కడి రిటర్నింగ్‌ అధికారులు టీఆర్‌ఎస్‌ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకున్నారని ఆరోపించారు.

దొడ్డిదారిన గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నిక ఫలితాలు చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 72,581 ఓట్లు రాగా.. బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి 72,205 ఓట్లు వచ్చాయి. కిషన్‌ రెడ్డి 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దాంతో, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అందుకే, కిషన్‌రెడ్డి గెలిచారని మల్‌రెడ్డి ఆరోపించారు.

అవకతవకలు ఇవిగో..

ఎన్నికల సంఘానికి ఇచ్చిన లేఖలో ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన అవకతవకలను మల్‌రెడ్డి రంగారెడ్డి వివరించారు. పోలింగ్‌ స్టేషన్‌ 199 (ఉమ్రాన్‌ఖాన్‌ గూడ)లోని రెండు ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇక్కడి ఈవీఎంలో కిషన్‌ రెడ్డికి 148 ఓట్లు పోల్‌ కాగా వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కిస్తే ఆయనకు 139 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. అలాగే, ఈవీఎంలో తనకు 130 ఓట్లు వస్తే.. వీవీప్యాట్‌లో 129 వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో పోలైన ఓట్లు, కౌంటింగ్‌ సమయంలో లెక్కించిన ఓట్ల మధ్య కూడా భారీ వ్యత్యాసం ఉందని మల్‌రెడ్డి తెలిపారు.

ఎన్నికల అధికారులు కౌంటింగ్‌ సందర్భంగా లెక్కించిన వివరాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 1,96,851 ఓట్లు పోలైనట్లు రికార్డుల్లో చూపించారు. కానీ, అంతకుముందు, పోలింగ్‌ సందర్భంగా.. 1,95,973 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ప్రకటించారు. మండలాలవారీగా పోలైన ఓట్లు, పోలైన శాతం వివరాలను అధికారికంగా అందజేశారు. మొత్తం 878 ఓట్లు అధికంగా కౌంటింగ్‌లో చూపించారు, అని ఆరోపించారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: మల్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం ఎన్నికల్లో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, ఆధారాలన్నీ ఎన్నికల సంఘానికి అందచేశామని మల్‌రెడ్డి తెలిపారు. తనకు ఎన్నికల కమిషన్‌ న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిన అభ్యర్థులమంతా కలిసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుమారుడు మొబైల్‌ ఫోన్‌తో కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారని, కేటీఆర్‌ ఆదేశాల మేరకు రిటర్నింగ్‌ అధికారి నడుచుకున్నారని, 18వ రౌండ్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే తన మెజారిటీని తగ్గించారని ఆరోపించారు.

విచారణ జరపాలి: మల్లు రవి

జడ్చర్ల: అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీకి వేసిన ఓట్లు.. టీఆర్‌ఎస్ కు పడ్డాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. అందువల్లే ఫలితాలు తారుమారైనట్లు తమ పార్టీ స్థానిక నాయకులు చెబుతున్నారని అన్నారు. ఈవీఎంల టాంపరింగ్‌పై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవసరమైతే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు లేకుండా చేయడం వల్ల అంతిమంగా ప్రజాస్వామ్యం ఓడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Please follow and like us:

You may also like...