Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పథకాల హామీల వెనుక ఎవరేమి చేయాలో తెలుసా ?

పన్నుల వసూలు రేటులో కూడా మనమే నంబర్‌ వన్‌!

ఇది మన రాజకీయ నాయకులకు చేరేలా చూడండి?

హైదరాబాద్/బ్యూరో చీఫ్: ప్రభుత్వ పథకాలన్నీ మంచిగున్నయి. పుట్టిన బిడ్డలకు, బాలింతలకు సర్కారు అన్నీ ఇస్తున్నది. గట్లనే ఇరవై ఒక్క దినం (బారసాల– నామకరణ దినోత్సవం) ఖర్సు కూడా ఇస్తే మంచిగుంటది సారూ!’
ఎన్నికల ప్రచారంలో ఓ నేతతో ఒక మహిళ అన్న మాట ఇది! తెలిసి అన్నదో తెల్వక అన్నదో గానీ ఆమె మాటలో ఎంతో అర్థం ఉంది!
ఎన్నికలు ఎలాగూ అయిపోయాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ అలవిగాని హామీలు ప్రకటించాయి. అన్నీ ఉచితంగా ఇస్తామని ఊరించాయి. అయితే అందలం ఎవరికి అందినా, ఆనందం మాత్రం అందని మానిపండే! ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా పతనం అంచున ఉంది. అధికారాన్ని చేపట్టే పార్టీ ఏదైనాగానీ, ఇప్పటికే ఉన్న పథకాల, కొత్తగా చేసిన వాగ్దానాల అమలు కత్తిమీద సాములా మారబోతోంది. ఆర్థికభారం, ద్రవ్య నిర్వహణ కొత్త ప్రభుత్వం నెత్తిన కత్తిలా వేలాడబోతోంది. ఇప్పటికే ఉన్నవి పోను కాంగ్రెస్‌ హామీల అమలుకు కొత్తగా దాదాపు రూ.86 వేల కోట్లు కావాలి. టీఆర్‌ఎస్‌ కొత్త హామీల అమలుకు 85 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ఖజానాకు నికర ఆదాయం ఏడాదికి సుమారు 88 వేల కోట్లే! ఇచ్చిన హామీలను నిజాయతీగా అమలు చేయాలంటే, ఆదాయం అకస్మాత్తుగా రెట్టింపుకన్నా మించాలన్నమాట. అల్లావుద్దీన్‌ అద్భుత దీపం తెచ్చినా అది అసాధ్యం.

రాష్ట్ర ఆదాయంలో వార్షిక వృద్ధి 14– 16 వేల కోట్లు మాత్రమే! ప్రజలపై పన్నుల విధింపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. పన్నుల వసూలు రేటులో కూడా మనమే నంబర్‌వన్‌! అందువల్ల కొత్తగా పన్నుల ద్వారా ఆదాయం పిండుకునే అవకాశం పెద్దగా లేదు. అమ్ముడయ్యే ప్రభుత్వ భూములు గుంటెడు లేకుండా పోయాయి. ఖజానాకు మహారాజ పోషకులైన తాగుబోతులు… ‘ఇక ఇంతకంటే మేం తాగలేంగాక తాగలేం’ అంటూ తప్పతాగి గిలగిలా తన్నుకుని రోడ్ల మీద పడిపోతున్నారు! అందువల్ల ఎక్సైజ్‌ ఆదాయం కూడా పెద్దగా పెరిగే చాన్స్‌ లేదు. పెట్రోలు, డీజిలుపై పన్ను మన రాష్ట్రంలోనే గరిష్ఠంగా ఉంది కనుక, దాన్నింకా పెంచి సొమ్ములు గుంజలేం. అప్పులు కూడా గరిష్ఠ స్థాయికి చేరి, కొత్తగా పుట్టని పరిస్థితి ఉంది. స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.5 శాతం వరకు ఏటా అప్పు తెచ్చుకోవచ్చు. 2018–19లో తెలంగాణ జీఎస్‌డీపీ అంచనా 8.43 లక్షల కోట్లు. ఇందులో 3.5 శాతం అంటే… దాదాపు 30 వేల కోట్ల అప్పు తెచ్చుకునే అర్హత ఉంది. ఆ పరిమితి ఎప్పుడో చేరుకున్నాం. ఇప్పటికే చేసిన బాకీలకు భారీగా వడ్డీలు కట్టాల్సిన టైమొచ్చింది. సాధారణంగా ప్రభుత్వం పదేళ్ల కాలానికి అప్పులు తీసుకుని, పదో ఏట నుంచి చెల్లింపు మొదలుపెడుతుంది. కానీ ఖజానా నిండుకోవడంతో 15, 20, 25 ఏళ్ల కాలానికి అప్పులు తీసుకుంటున్న పరిస్థితి. ఇలా కిస్తులు కట్టలేక దీర్ఘకాల రుణాలు తీసుకుంటున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే! రుణ వ్యవధి పెరిగితే వడ్డీ భారం కూడా పెరుగుతుంది కదా! ఇక మిగిలింది రిజర్వ్‌బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్‌ ఒక్కటే. కానీ ఒ.డి.కి వెళ్లి, వారం రోజుల్లో సర్దుబాటు చేయకుంటే… ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చెల్లింపులనూ ఆపేయాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశిస్తుంది.

గవర్నర్‌ జీతం, హైకోర్టు జడ్జి పెట్రోలు ఖర్చు సహా అన్నీ ఆగిపోతాయి. రాష్ట్రం పరువు బజారున పడుతుంది. అలా నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం మరోవైపు తానిచ్చే జీఎస్టీ వాటాను కూడా ఆలస్యంగా 20వ తేదీన చెల్లిస్తున్నది. దీంతో ప్రతి నెలా మొదటి తారీఖు వస్తున్నదంటేనే ఆర్థిక శాఖ అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేయడమే కనాకష్టంగా మారింది. నెలనెలా అప్పోసప్పో చేసి, చిల్లర శ్రీ మహాలక్ష్మి అనుకుంటూ అక్కడా ఇక్కడా ఏరుకొచ్చిన సొమ్ముతో జీతాలు చెల్లిస్తున్నారు. 2004లో సాచ్యురేషన్‌ పేరుతో సర్కారు సొమ్మును స్కీమ్‌ల పేరిట విచ్చల విడిగా పంచి పారేసిన వైఎస్‌, 2009లో గెలిచే నాటికి సంక్షోభంలో చిక్కుకున్నారు.అనుకోకుండా చనిపోయారు కానీ, బతికుంటే కష్టాలు తప్పకపోయేవి! ఇప్పుడూ ఆనాటి సంక్షుభిత పరిస్థితే నెలకొని ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మన రాష్ట్రం సుమారు 15 ఏళ్లకు సరిపడా ఖర్చును గత ఐదేళ్లలోనే చేసేసింది. రేపు ఎవరైనా అధికారం చేపట్టవచ్చు. కానీ పుట్టబోయే బిడ్డల మీద అప్పుల భారం మోపే అధికారం మనకు లేదుగాక లేదు!

ప్రజలు, నేతలు దొందూ దొందే! ఆర్థిక శాఖలో బాధ్యత, దూరదృష్టిగల సమర్థులైన ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వంటి ఉన్నతాధి కారులు ఉన్నందున లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా ఇంతకాలం పరువు బజారున పడకుండా ఆగింది ! కానీ ఇలా ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదు. ఉద్యోగులు ఐఆర్‌–ఫిట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులు భృతి కోసం, రైతులు రుణమాఫీ కోసం, పెన్షనర్లు పెరిగే పింఛన్‌ కోసం, డబుల్‌ ఇళ్ల లబ్ధిదారులు 50 వేల గ్రాంటు కోసం, ఇంకా రకరకాల వర్గాలు రకరకాలుగా హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీల నేతలు పైకి ఇదంతా సంక్షేమమని ప్రచారం చేసుకుంటున్నారు. తక్షణ తాత్కాలిక లబ్ధిని ఆశించి జనం ఓట్లేస్తున్నారు .

నిజం చెప్పాలంటే అటు ప్రజలు, ఇటు పార్టీల నాయకులు/ పాలకులు నైతికంగా పాతాళానికి దిగజారిపోయారు. ఎన్నికల పేరుతో సాగిన మద్యం, డబ్బు పంపిణీ చూస్తే అసహ్యం వేసింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే యావతో నేతలు ప్రజలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. ఉచితం అంటే అర్థం తగినది అని! కానీ దాన్ని ‘ఫ్రీ (అ–మూల్యం) అంటే విలువలేనిదిగా మార్చేశారు.

అవసరం ఉన్నవాడికి లేనివాడికి పందేరం చేస్తున్నారు. ఇక ఇంతకంటే పథకాలుగా ప్రకటించడానికిగానీ, పతనమవడానిగానీ ఏమీ మిగల్లేదు. పార్టీలుగానీ, నాయకులుగానీ తమ సొంత ఆస్తులమ్మి పథకాలు అమలు చేయరు, మళ్లీ మన మీదో, మన పిల్లల మీదో భారం మోపుతారన్న ఇంగిత జ్ఞానం ప్రజలకు లేదు. ప్రజలను సోమరిపోతులుగా మార్చడం వల్ల రాష్ట్ర భవిష్యత్తే దెబ్బతింటుందన్న వివేకం నాయకులకు లేదు. ఒళ్లు గుల్లయ్యేలా తాగబోసి, వాడి శరీరం నాశనమయ్యాక ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం ఏం సంక్షేమం? ప్రభుత్వ ఉద్యోగి 61 ఏళ్లు పనిచేయడం ఏమిటి? పెన్షనర్లకు 57 ఏళ్ల నుంచే పింఛన్‌ ఇస్తామనడం ఏమిటి? పిలగాడికి నిరుద్యోగ భృతి ఇచ్చి, పిల్లకు పెళ్లి ఖర్చిచ్చి, గర్భిణికి ప్రసూతి ఖర్చులిచ్చి, వృద్ధులకు ఇంటికి రెండు పెన్షన్లిచ్చి, ఉచితంగా సన్నబియ్యం ఇచ్చి, గ్యాస్‌ సిలిండర్లిచ్చిన తర్వాత ఎవడైనా ఇక ఎందుకు పని చేయాలి? ఎవడూ ఏ పనీ చేయకపోతే ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది ఎలా? పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందా లేక అన్నీ ఉచితంగా ఇచ్చి ఇంట్లో పండబెడితేనా? ఒకవేళ ఆదాయం లేక ప్రభుత్వం దివాలా తీస్తే, అప్పటికే పని అలవాటు మరిచిపోయిన జాతి రేపు ఎలా బతుకుతుంది? పని సంస్కృతిని పెంచితే సృజనాత్మకత పెరుగుతుందా లేక తాగబోసి మత్తులో ముంచితేనా? చేపను వేటాడడం నేర్పిస్తే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారా, తామే చేపను కొట్టుకొచ్చి వండి కంచంలో పెడితేనా? అలా ఎన్నాళ్లు పెట్టగలరు?

ఇకనైనా మేలుకుంటారా?
అప్పుచేసి పప్పుకూడు ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత రాష్ట్రం అన్యాయమైపోతుంది. 27.96 లక్షల కోట్ల జీఎస్‌డీపీ ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 80 వేల కోట్ల దాకా అప్పు చేసే అనుమతి ఉన్నా 20 వేల కోట్ల మించి చేయవద్దని రూల్‌ పెట్టుకుంది. మనమూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మన మార్గాన్ని సరి చేసుకోవడానికి ఇదే సమయం. ‘వారిజాక్షులందు వైవాహికములందు…’ మాత్రమే కాదు; రాజకీయాల్లో కూడా అబద్ధాలు ఆడవచ్చు. తప్పేం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే… లోక్‌సభ ఎన్నికలు అయిపోయే దాకా కొత్త పథకాల అమలును వాయిదా వేయాలి. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను నిపుణులతో మదింపు వేయాలి. పార్టీలు అనారోగ్యకరమైన పోటీని పక్కనబెట్టి, వాస్తవాలను శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుంచాలి. ఇప్పుడప్పుడే ఎన్నికలు ఉండవు, ఓడిపోతామనే భయాలేమీ ఉండవు. ఆకలయ్యే వాడికి అన్నం పెడితే రుచి. ఆపన్నులకు, అసహాయులకు, అవసరార్థులకు మాత్రమే ప్రభుత్వ సహాయం అనే ప్రాతిపదికన నూతన ఆర్థిక– సంక్షేమ విధానాన్ని ఆవిష్కరించాలి.

ఆర్థికవేత్తలను సంప్రదించి ఎక్స్‌పెండిచర్‌ రేషనలైజేషన్‌ (వ్యయ హేతుబద్ధీకరణ) అమలు చేయాలి . రైతు బంధు వంటి పథకాలు అవసరార్థులకు మాత్రమే అందేలా ‘ పదెకరాల లోపు ఉన్నవారికే– పంట వేసిన వారికే’ అన్న షరతులు పెట్టాలి. దీనివల్ల వేల కోట్లు మిగుల్చుకోవచ్చు. పెరిగే జీవన వ్యయం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులకు ఎప్పటికప్పుడు కరువు భత్యం అందుతున్నందున, ఫిట్‌మెంట్‌పై పరిమితి పెట్టాలి. ఏటా రాష్ట్ర ఆదాయం 15–18 శాతం మాత్రమే పెరుగుతున్నందున, అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా, ఉద్యోగులకు ఐదేళ్లకోసారి 15 శాతానికి మించి జీతాలు పెంచకుండా చట్టం చేయాలి. ఉద్యోగుల పనితీరును దానికి ముడిపెట్టాలి. ఉత్పాదక రంగంపై, పరిశ్రమల ఏర్పాటు వంటి ఉపాధి కల్పన సౌకర్యాలపై ఖర్చును పెంచాలి. తద్వారా సర్వీసెస్‌ సెక్టార్‌పై ఆధారపడే అగత్యాన్ని తప్పించాలి. శాసనమండలి, కార్పొరేషన్ల వంటి రాజకీయ పునరావాస కేంద్రాల్ని రద్దు చేయాలి. లగ్జెంబర్గ్‌ అనే చిన్న ఐరోపా దేశంలో, కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రజలందరికీ ఉచిత రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారట. భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి ఆలోచనలు చేయాలి. రాష్ట్రంలో 600లకు పైగా పథకాలు అమలవుతున్నాయి. వీటిలో చిల్లర మల్లర పథకాలన్నీ తీసేయడం ద్వారా దాదాపు 3 వేల కోట్లు మిగిల్చుకోవచ్చన్నది ఒక లెక్క. వ్యయ హేతుబద్ధీకరణ, పెరిగే ఆదాయం ద్వారా ఏటా 30 వేల కోట్ల దాకా అందుబాటులోకి తెచ్చుకుంటే తప్ప రాష్ట్రం గట్టెక్కే పరిస్థితి లేదు.

అందువల్ల, ఉద్యమకారుడిగా పనిచేసిన కేసీఆర్‌, సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మార్పుకోరే పార్టీ ప్రతినిధి లక్ష్మణ్‌, సంస్కరణల పార్టీ నేత రమణ, విద్యావేత్త కోదండరాం కలసి రాజకీయాలకు అతీతంగా ఒక మాట అనుకుంటే, ఈ అనుచిత హామీల విష వలయం నుంచి తెలంగాణను బయటపడేయడం పెద్ద కష్టమేం కాదు. అందరూ ఒక మాటమీదుంటే రాజకీయంగా ఒకరికే నష్టం జరుగుతుందనే భయమూ ఉండదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నేతలు తమ జాతి ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఏకమైనట్టే, అనుచిత హామీలను అదుపు చేసే విషయంలో తెలంగాణ నేతలు ఒక్కటవ్వాలి . అప్పుడు తెలంగాణ నిజంగానే దేశానికి దారి చూపిన రాష్ట్రమవుతుంది. లేకపోతే అప్పు అనే నిప్పును కొంగున కట్టుకుని తెలంగాణ దెబ్బతినడం ఖాయం. మనం మన పిల్లల కోసం వ్యక్తిగత ఆస్తుల్ని పోగేస్తున్నాం. కానీ ఒక జాతిగా దెబ్బతింటే మనం ఎన్ని ఆస్తులు కూడబెట్టినా పైసాకు కొరగావు. అందువల్ల రేపటి తరాల బాగు కోసం ఐదుగురు నేతలూ ఏకాభిప్రాయానికి వస్తారా? రాజనీతిజ్ఞులు అనిపించుకుంటారా? లేక రాజకీయులుగానే మిగిలిపోతారా? ఇదే జరిగితే ఆ మహిళ అడిగినట్టు ఇరవైఒక్క దినం ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇవ్వక తప్పదు!! రాజకీయ లాభం కోసం తెలంగాణకు నష్టం చేయడమా? తెలంగాణకు లాభం చేయడం కోసం రాజకీయంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడడమా? ప్రజలు, నేతలు ఆలోచించుకోవాలి!

Please follow and like us:

You may also like...