Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

సిక్కోలు ప్రజలు భాషా హీనులా బెందాళం క్రిష్ణారావు ?

శ్రీకాకుళం జిల్లా : నేటి శ్రీకాకుళం జిల్లా ఒకప్పటి కళింగ ప్రాంతంలో భాగం. ప్రాచీన కాలం నుంచీ స్వతంత్ర భాషా సంస్కృతులకు తలమానికంగా నిలిచిన ప్రాంతం. క్రీస్తుపూర్వం కళింగ యుద్ధంలో లక్షన్నర మంది ప్రాణత్యాగాలు చేసి ఆనాటి అశోకుడిలోనే పరివర్తన తీసుకొచ్చిన చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేల నుంచి వంశధార నది మీదుగా సముద్రయానం చేసి శ్రీలంక, జావా, సుమత్రా వంటి దూర దేశాల్లో సామ్రాజ్యాలు స్థాపించినవారు ఈ ప్రాంత వాసులే. గత శతాబ్దంలో కేవలం పండితులకే పరిమితమై, గ్రాంథిక భాషే చలామణి అవుతున్న రోజుల్లో తన జీవితాన్ని మొత్తం వాడుక భాషోద్యమానికి ధారబోసిన గిడుగు వేంకట రామమూర్తి పుట్టిన నేల. తెలుగు వారిలో తొలి పీహెచ్‌డీ పట్టభద్రుడు డా.చిలుకూరు నారాయణ రావుది ఈ జిల్లా. ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతలైన గురజాడ అప్పారావు, గరిమెళ్ల సత్యనారాయణ, తాపీ ధర్మారావు, చాగంటి సోమయాజులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామి, ఆంధ్రాంగ్ల భాషలకు ప్రామాణికమైన నిఘంటువుని కూర్చిన పాలూరి శంకరనారాయణ, రష్యన్‌-తెలుగు నిఘంటువును రూపొందించిన ఉప్పల లక్ష్మణరావు వంటి ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు ఈ ప్రాంతం. ఆదికవిగా ప్రచారంలో ఉన్న నన్నయ్య పుట్టక ముందే ఈ జిల్లాలో సీస పద్యాలు రాసిన కవులున్నారు. ఆది నుంచీ ఆధునిక కాలం వరకూ ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు, కళలకు కాణాచి. అయితే చరిత్ర తెలియని, తెలిసినా దానిని కావాలనే మరుగుపర్చి, తమ స్వీయ ప్రాబల్యాన్ని పెంచుకునేలా స్వలాభాల కోసం కొందరు చేస్తున్న కుటిల వ్యాఖ్యానాలు ఇటీవలి కాలంలో శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువైపోయాయి.

ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వ్యాపార మీడియా దృష్టిలో శ్రీకాకుళం జిల్లా ప్రజలంటే కేవలం పని మనుషులు, వారికి భాషా సంస్కారం లేదు. తాజాగా ఇదే విషయాన్ని ఒక తెలుగు మీడియా అధిపతి కూడా ఇక్కడి ప్రజా ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసే సమయంలో తనదైన శైలిలో వెకిలి ప్రశ్నగా వెళ్లగక్కాడు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామమోహన్‌ నాయుడుని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ‘మీ శ్రీకాకుళం ప్రజలకు పొట్ట కోస్తే ఆక్షరం ముక్క రాదు..కదా! మీరెలా హిందీలో అనర్గళంగా మాట్లాడేశారు’ అన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని ప్రజలు భాషాహీనులని మీడియా అధిపతి అలా వెకిలి ప్రశ్న వేసినా సదరు ప్రజాప్రతినిధి కూడా పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పించ లేదు. కానీ ఇప్పటికే భాషాపరంగా సినిమాలు, టెలివిజన్‌ సీరియళ్లలో శ్రీకాకుళం యాసని, మాండలికాలను పనివాళ్ల పాత్రలకు, హాస్య పాత్రలకు ఉపయోగించుకుంటున్న తీరుపై అంతా భగ్గుమంటున్నారు. ఇలాంటి పైత్యాన్నే ‘కేరింత’ సినిమాలో బయట పెట్టినందుకు అప్పట్లో దిల్‌ రాజు వాహనంపై అంబేద్కర్‌ వర్సిటీ విద్యార్థులు కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు.

సాధారణంగా మీడియా అనేది ప్రాంతీయతలకు అతీతంగా సాగుతున్న ప్రజా సమాచార సాధనంగా అంతా భావిస్తుంటారు. అందులో కూడా జిల్లాల వారీగా అక్కడి ప్రజలపై ఇలా చులకన భావంతో వ్యాఖ్యానించడం ఎంత వరకూ సంస్కారయుతమైన చర్య అనేది ఎవరికి వారే విచక్షణతో ఆలోచించుకోవాలి. ఐదారేళ్ల కిందట ఈ మీడియా అధిపతి ప్రేలాపనలు ప్రత్యేక తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వివాదాలకు ఆజ్యం పోశాయి. దాంతో అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలంపాటు ఈయన నడిపే న్యూస్‌ ఛానల్‌ ప్రసారాలను నిషేధించింది. ప్రతీ ఆదివారం తన ఛానల్‌లో ప్రసారం చేసే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల్లో ఎప్పటికప్పుడు వ్యంగ్యం ముసుగులో ఆయన ధోరణి బయట పడుతున్నా ఒక జిల్లా ప్రజలను లక్ష్యంగా చేసుకుని ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదని’ వ్యాఖ్యానిస్తూ ప్రశ్నించడం ఎంత వరకూ సంస్కారం అనే ప్రశ్న అందరి నుంచీ వ్యక్తమౌతోంది. ఆయన ఏ భాష గురించి ఆ ప్రశ్న వేసినా అక్కడి ప్రజలు భాషాహీనులనే అభిప్రాయం అందులో తొణికిసలాడుతోంది.

ఈ జిల్లా ప్రజలకు ఇతర భాషలు రావనేది ఆయన లాంటి కొంతమంది భావన అయితే కావొచ్చు, కానీ, ఇక్కడి ప్రజలు కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటా అక్కడ భాషా సంస్కృతులతో సాంగత్యం పొందుతూనే ఇక్కడి తమ మాతృభాషని కూడా అక్కడ బతికించుకుంటూ జీవన సమరాన్ని సాగిస్తున్నారు. అందుకు ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఇక్కడ నుంచి వలస వెళ్లినవారు నడుపుతున్న భాషా సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, పత్రికలు, నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు వంటివి తార్కాణాలు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాకే ఉత్తరాది రాష్ట్రాలతో దగ్గర అనుబంధముంది. ఈ జిల్లాలో సగానికి కన్నా ఎక్కువ మంది తెలుగుతో పాటు ఒరియా, హిందీ భాషలు కూడా మాట్లాడగలరన్న వాస్తవం బహుశా ఆయనకి తెలియకపోవచ్చు. తెలుసుకుని ప్రశ్న వేయగలిగుంటే తన విజ్ఞతను నిలుపుకోగలిగే అవకాశం ఉండేది. కేవలం ఒక ప్రజాప్రతినిధిని గొప్పగా భజన చేయడానికి ఆయన తప్ప మిగిలిన వారంతా భాషా శూన్యులు అనేలా వేసిన ప్రశ్న శ్రీకాకుళం జిల్లాలో వివాదాన్ని రేపుతోంది. ఆ ప్రశ్నకు ఎంపీ నవ్వుతూనే ఏ మాత్రం దానిని ఖండించలేకపోవడంపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి విషయంలో కొనసాగుతున్న నిర్లక్ష్యానికి ఇప్పటికే ప్రజలు తమ నిరసనలని వివిధ వేదికల ద్వారా తెలియజేస్తున్నారు. నిరంతరం వెనుకబడిన జిల్లా అంటూ పాలకులు జాలి కురిపించడం, ఆ సానుభూతిలోనే ఓట్లు దండుకుని వెళ్లిపోవడం రివాజుగా మారింది. రానున్న ఎన్నికల్లో ఈ ధోరణికి చెక్‌ చెప్పాలని యువతరం భావిస్తోంది. ఉత్తరాంధ్రకూ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఏం ఒరగబెట్టారని ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్‌ మీడియాలోనూ ప్రశ్నిస్తున్నారు. పాలకులకు బాకాగా ఉపయోగపడుతున్న మీడియాలో కూడా ఈ జిల్లా ప్రజలపై చవకబారు వ్యాఖ్యానాలు వ్యక్తమవుతుండడంపై మరింత వ్యతిరేకత నెగడులా రాజుకుంటోంది. ఎవరు ఎలా ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నా భాష విషయంలో కూడా శ్రీకాకుళం జిల్లా అంటే చులకన భావాన్ని పెంచేలా నోరు పారేసుకోవడం ఎంత మాత్రమూ సంస్కారయుతమైనది కాదనే అంతా భావిస్తున్నారు.

Please follow and like us:

You may also like...