విప్లవ వీరుడు రేనాటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..!

స్వతంత్ర సమరం అంటే మనకు చరిత్రలో తెలిసినవి 1857 సిపాయిల తిరుగుబాటు నుండే. అంతకు పూర్వమే మన దేశములో ఎందరో మహనీయ వీర పుత్రుల పరపాలనాన్ని ఎండగట్టి తిరుగుబాట్లు చేసారు. 1780 లో తమిళనాడులో రాణీ వేలునాచియర్, ఆ తరువాత కట్టబ్రహ్మన్న, మరుదు పాండ్య సోదరులు , రాణి చెన్నమ్మ ఇలా ఎందరెందరో మహనీయ వీర పుత్రులు, వీర వనితలు ఉన్నారు. మన చరిత్ర వీరందరి గూర్చి విపులంగా చెప్పదు. 1757 నుండీ ఆంగ్లేయులు దేశములో తమ రాజ్యాన్ని విస్తరించడానికి పూనుకున్నారు. 1860 లనాటికి దేశం పూర్తిగా వారి అధీనములోనికి వచ్చింది . 

పరిపాలనలో మ్రగ్గడాన్ని సహించని భారతీయ వీరపుత్రులు , వీరాపుత్రికలు విప్లవాలను లేవదీశారు. మన తెలుగు నేలను సిపాయిల తిరుగుబాటునకు ముందే ఎన్నో తిరుగుబాట్లు ఆంగ్లేయుల మీద జరిగాయి. నిజాం నవాబు నేడు రాయలసీమ అని పిలవబడే ప్రాంతాలను లేదా దత్తమండలాలను ఆంగ్లేయులకు 1801 లో వ్రాసి ఇచ్చాడు. ఈ ప్రాంతములో ఉన్న పాలెగాండ్లు అందరూ అధికారం కోల్పోయారు . 1807 లో అనేకమంది పాలెగాండు అందరూ ఈ ముష్కరుల మీద తిరుగుబాటు చేయగా చాలామందిని ఆ పోరాటంలో చంపివేసి మిగిలినవారిని అణచివేసి భయపెట్టి వారికి భరణం ఇస్తామని రాజీకుదుర్చుకున్నది ఆనాటి ప్రభుత్వం. పాలెగాళ్ళ వ్యవస్థను తీసివేసిన ఆంగ్ల ప్రభుత్వం వారికి నెలసరి భరణం ఇంత అని అందించేవారు. సంతతి లేని రాజ్యపాలకుల తరువాత ఆ రాజ్యాలను తమ పాలనలో కలుపుకునేవారు. అలాగే సంతతి లేని పాలెగాండ్లకు ఆ తరువాత భరణం ఇచ్చేవారు కాదు. మన ప్రజల సాయముతోనే ప్రజలను హింసించే వారు ఆనాటి ఆంగ్ల ముష్కరులు. ఎదురుతిరిగిన వారికి మరణమే గతి. ఆలా ఎదురు తిరిగినవారిని చంపి వారి దేహాన్ని తలను ఊరేగించి ప్రజలను భయభ్రాంతులను చేసేవారు ఆనాటి ముష్కర ఆంగ్లేయ పాలకులు .

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లా రెడ్డి ఉయ్యాలవాడ ( నేడు కర్నూల్ ప్రాంతం ) కి పాలెగాడుగా ఉండేవారు. అయన అధీనములో దాదాపు 60 కి పైగా సంపన్న గ్రామాలూ ఉండేవి. సురక్షితమైన కోటలు, సైన్యమును సమకూర్చుకుని పాలన్ చేసేవాడు. నరసింహ రెడ్డి తల్లి నీలమ్మ .. నీలమ్మ తండ్రి కర్నూల్ ప్రాంతములోని నంద్యాలకు దగ్గరగా నున్న నొస్సం ప్రాంతానికి జమీందారుగా ఉండేవారు. ఆయనకు కుమార్తెలు తప్ప కుమారులు లేరు కావున తన కుమార్తె బిడ్డ అయిన నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామిరెడ్డి కి కుమారులు లేరు కావున భరణం ఇవ్వడం ఆపివేశారు ఆంగ్లేయులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్వికులు నోసుం, ఉయ్యాలవాడ, కంబం జాగీర్ధార్లు.ఈ మూడింటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక్కరే వారసుడు. 1843 ప్రాంతంలో ఆంగ్ల ప్రభుత్వం వారసత్వ హక్కుల మీద చట్టం తీసుకొచ్చింది.ఈ చట్ట ప్రకారం వారసత్వ హక్కులు ఒక్క జమీందారీ మీదనే దక్కుతాయి. ఇలా వారసత్వంగా సంక్రమించే జమీందారీ పాలనా హక్కులు కోల్పోవలసి రావటం వలన అనేకమంది జమీందార్లు మరియు పాలెగాళ్లు వారి వారసత్వం మాన్యాలు, భూములు, భరణం కోల్పోయారు.

ఇలా అధికారం కోల్పోయిన వారందరూ అనేక మార్లు మన తెలుగునాట పోరాటాలు చేసారు .. ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం అవేమీ రికార్డులకెక్కించలేదు. ఆలా అధికారం కోల్పోయిన వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒకరు. అలా అయన ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం మీద గెరిల్లా యుద్ధం చేసి అనేక నెలలపాటు ఆంగ్ల ప్రభుత్వ పాలకులకు నిద్ర లేకుండా చేసారు. దాదాపు 900 కి పైగా నాడు ఆంగ్ల ప్రభుత్వం దారుణ నేరాలు మోపి అందమైన దీవులకు కొందరిని, మరి కొందరిని జైళ్లలో వేసి మ్రగ్గబెట్టారు. చివరకు మోసముతో పట్టుకుని నరసింహారెడ్డి ని హత్య, దోపిడీ నేరాలు మోపి కోయిలకుంటలో ఆయన్ని 1847 లో ఉరికొయ్యకు వేలాడతీసారు. మరొకరు విప్లవం అనే మాట ఎత్తకుండా ఆయన తలను ఆ ఉరి కొయ్యకే దారుణంగా వ్రేలాడదీసారు . దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆ తల ఉరికొయ్యకు వేలాడుతూనే ఉండి ప్రజల్లో విప్లవాన్ని రగిల్చింది .

Please follow and like us:

You may also like...