రేవంత్‌పై ఫిర్యాదు చేసిన రామారావుపై 32 కేసులు….!

  • అన్నీ భూకబ్జాలకు సంబంధించినవే 
  • న్యాయవాది రామారావుపై రౌడీషీట్‌ కూడా 
  • నకిలీ పత్రాలు తయారు
  • 14 కేసులు చిలకలగూడ స్టేషన్లోనే నమోదు

హైదరాబాద్‌/బౌద్ధనగర్‌ : రేవంత్‌ రెడ్డి పై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌ రామారావుపై చిలకలగూడ ఠాణాలో పలు కేసులున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అతడిపై చిలకలగూడ పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. ఒడిసాలోని బరంపురానికి చెందిన ఇమ్మినేని రామారావు కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి ఎల్లారెడ్డిగూడ పడాల రామిరెడ్డి కళాశాలలో లా చదివాడు. వెలమ వర్గానికి చెందిన రామారావు ఆ తర్వాత బరంపురం వెళ్లిపోయాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నగరానికి వచ్చి పద్మారావునగర్‌లో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డాడు. న్యాయవాదిగా కార్యాలయం తెరిచాడు. ప్రస్తుతం ఇతనిపై భూకబ్జా ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆస్తి, భూమి, ప్లాట్స్‌ తదితరాలకు సంబంధించిన వివాదాల్లో క్లయింట్లు ఇతని వద్దకు వస్తారు. ఆస్తుల పత్రాలను ఇతనికి అందజేస్తారు.

అవి విలువైన ఆస్తులు, భూములైతే వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి కబ్జా చేస్తాడు. న్యాయవాద వృత్తిని అడ్డుగా పెట్టుకుని ఇలా భూకబ్జాలకు పాల్పడేవాడు. న్యాయవాది రామారావు అనుచరులతో కలిసి వచ్చి తన ఇంటిని కబ్జా చేశాడని 2013 అక్టోబరు 24న పద్మారావునగర్‌కు చెందిన జి.సాయిపవన్‌ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భూకబ్జాలకు సంబంధించి 2016 జనవరి 11న ఒక్కరోజే రామారావుపై ఐదు కేసులు నమోదయ్యాయి. దాంతో, ఆ ఏడాది మార్చి 14న రామారావును చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. 19న రౌడీషీట్‌ తెరిచారు. ప్రస్తుతం ఇతనిపై చిలకలగూడ, చందానగర్‌, బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో 32 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో 14 చిలకలగూడ స్టేషన్లోనే నమోదయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం సీసీఎస్ కు బదిలీ అయ్యాయి.

Please follow and like us:

You may also like...