యూఏఈ రూ.700 కోట్ల సాయం.. కేరళకు దక్కనట్లేనా..?

తిరువనంతపురం/న్యూఢిల్లీ/దుబాయి: మానవీయ కోణంలో స్పందించి యూఏఈ ప్రకటించిన రూ.700 కోట్ల ఆర్థిక సాయం.. కష్టకాలంలో ఉన్న కేరళకు దక్కేట్టు లేవు.. స్వయంగా దుబాయి రాజు, యూఏఈ ప్రధానమంత్రి ట్విటర్ ద్వారా కేరళను ఆదుకోవాలంటూ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చి.. ప్రకటించిన భారీ ఆర్థిక సాయం బాధితులకు ఆమడదూరంలో ఆగిపోయే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. 14ఏళ్ల క్రితం భారత విపత్తు సహాయ విధానంలో 2004 సంవత్సరం కీలక మలుపుగా చెప్పవచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిననాటి నుంచి మన దేశం విదేశీ సహాయాలను అంగీకరించడం లేదు. అంతకుముందు 1991 ఉత్తరకాశీ భూకంపం, 1993 లాతూర్‌ భూకంపం, 2001 గుజరాత్‌ భూకంపం, 2002 బెంగాల్‌ తుఫాన్‌, 2004 జూలై బిహార్‌ వరదల సమయంలో భారతదేశం విదేశీ సహాయాన్ని స్వీకరించింది. అయితే, ‘దేశంలో తలెత్తే పరిస్థితుల్ని సొంతంగా ఎదుర్కొగలిగే సత్తాను భారత్‌ సాధించింది. అవసరమైతే విదేశీ సహాయాన్ని తీసుకుంటాం’ అని పేర్కొంటూ 2004లో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్‌సింగ్‌ అమల్లోకి తెచ్చారు. కేరళకు యూఏఈ ప్రకటించిన సహాయం విషయంలోనూ ఈ విధానాన్ని వర్తిస్తుందని, కాబట్టి ఈ సాయాన్ని అంగీకరించే అవకాశం లేదని కేంద్రానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం కేంద్రం విదేశాల నుంచి ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. యూఏఈ సాయానికీ అదే వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  ఆధారంగా యూఏఈ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా.. దాన్ని తట్టుకుని నిలబడి.. నిలదొక్కుకోగల శక్తి భారత్‌కు ఉంది.. విదేశీ నిధులను స్వీకరించాల్సిన అవసరం లేదు..’ అంటూ ఆనాటి నుంచి అనుసరిస్తూ వచ్చిన విధానాన్ని యూఏఈ ప్రభుత్వం విషయంలో కూడా అనుసరించాలని కేంద్రం భావిస్తోందట. ‘ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయాలను భారత్ స్వీకరించడం లేదు. బహుషా యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖే తుది నిర్ణయం తీసుకుంటుంది..’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 
2004 నుంచి నేటి వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని ఏ దేశం నుంచి తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి చిన్న మొత్తాలను స్వీకరించినా అది రెండు దేశాల మధ్య సత్సంబంధాల్లో భాగమేనంటున్నారు. 2013లో ఉత్తరాఖండ్‌కు భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో చాలా దేశాలు తమ వంతు సాయం చేస్తామంటూ ముందుకు వచ్చినా వాటిని కాదనుకున్నామని వెల్లడించారు. మూడేళ్లుగా భారత ప్రభుత్వం తీసుకున్న విదేశీ నిధుల కంటే.. విదేశాలకు ప్రకటించిన విరాళాలే ఎక్కువ అని తెలిపారు.
యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో గల్ఫ్‌లో ఉంటున్న ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ ఆర్థిక సాయం కేరళకు అందేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డు వస్తున్నాయని తెలిసి వాపోతున్నారు. ఈ 700 కోట్ల రూపాయలను పెద్ద సంఖ్యలో దాతల నుంచి స్వీకరించిన విరాళాల రూపంలో (క్రౌండ్ ఫండింగ్) కనుక సేకరించినట్లయితే.. ఆ డబ్బును కేరళ ప్రభుత్వానికి అందజేసేందుకు భారత ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం అడ్డురావు. అలా కాకుండా యూఏఈ ప్రభుత్వమే ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లయితే మాత్రం నిబంధనల ప్రకారం సున్నితంగా తిరస్కరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా యూఏఈ, మాల్దీవులు, ఖతార్ వంటి దేశాలు కేరళకు సాయం ప్రకటించినా.. అవి వరద బాధితులకు అక్కరకు రాకపోవడం శోచనీయం. 
కాగా.. యూఏఈ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తీసుకుంటున్నట్లు కానీ.. తిరస్కరిస్తున్నట్లు కానీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కేరళకు అండగా ఉండాలంటూ దుబాయి రాజు, యూఏఈ ప్రధానమంత్రి మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆగస్టు 17న ట్వీట్లు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 18న స్పందించారు. కష్టకాలంలో ఉన్న కేరళకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన దుబాయి రాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ, భారత ప్రభుత్వాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు ఇది మరింతగా ఉపకరిస్తుందని ట్వీట్ చేశారు. మరి దుబాయి రాజు ప్రకటించిన ఆర్థిక సాయం గురించి మోదీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Please follow and like us:

You may also like...