భర్త హత్యకు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ప్లాన్ చేసిన భార్య!

ప్రేమ…పెళ్లి…హత్య…ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా హత్యకు ప్లాన్.

రామచంద్రపురం, తూ.గో.: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త… భార్య చేతిలో హతమయ్యాడు. రామచంద్రపురంలో గతనెల 26న జరిగిన ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మంగళవారం సీఐ కె. శ్రీధర్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు. తోటవారి వీధికి చెందిన చెల్లూరు రాంబాబు(39) అదే ప్రాంతానికి చెందిన చెల్లూరి క్రాంతి ప్రియదర్శినిలు 17 ఏళ్ల క్రితం పెద్దలు కాదన్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో వారు అద్దెకు దిగారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తర్వాత శీలంవారి సావరానికి చెందిన కుడుపూడి మోహనశివసాయి కిషోర్‌తో అతని భార్య వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఆరునెలల క్రితం భర్త, పిల్లలను వదిలి వెళ్ళిపోయింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించడంతో వారిద్దరికీ రాజీ కుదిర్చి కలిపారు. ఎస్పీ స్థాయి ఉన్నతాధికారి సమక్షంలో కౌన్సిలింగ్‌ వారికి ఇచ్చారు. ఆ తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్ధల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు సీఐ తెలిపారు.


ప్రియదర్శిని, కిశోర్ ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ రాంబాబును హతమార్చాలని డిసైడ్ అయ్యారని సీఐ చెప్పారు. ఇందుకు హైదరాబాద్‌లో ఉన్న ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడుకుంటూ పక్కా ప్రణాళికను భార్య తయారుచేసింది. గతనెల 26న రాత్రి భర్తకు ఆహారంలో మత్తు మందు కలిపిందన్నారు. ఆపై బెడ్‌రూంలో పడుకున్న భర్తను తలగడతో ఊపిరాడకుండా చేసి హతమార్చారు. పోలీసులకు తాను ఒక్కతినే చంపినట్లు చెబుతానని తనను అరెస్టు చేసిన తరువాత బెయిల్‌ తీసుకోమని రూ.2 లక్షలను ఆమె ప్రియుడికి ఇచ్చిందన్నారు. ఈ కేసులో పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవడంతో దర్యాప్తు వేగంగా సాగలేదని, ఈనెల 10న వారిద్దరినీ అరెస్టు చేసి కేసులు నమోదు చేశామన్నారు. వారు ఉపయోగించిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు దర్యాప్తు నిమిత్తం పంపినట్లు ఆయన చెప్పారు. హత్య జరిగిన ప్రాంతంలో వేలిముద్రలను సేకరించినట్టు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు

Please follow and like us:

You may also like...