ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు సర్వం సిద్ధం…!

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఎంపిక బోర్డ్ వారు నిర్వహిస్తున్న
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఈనెల 30 న జరుగనున్న ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు, భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపీఎస్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మొత్తం17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వాటిలో మొత్తం 7348 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు.

ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ,  ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచటం జరిగిందని, పరీక్షకు సంబంధించిన పూర్తి నియమనిబంధనలు హాల్ టికెట్ లో పొందుపరచబడ్డాయని పేర్కొన్నారు.

పరీక్ష హాలులోకి ప్రవేశించుటకు ముందే హాల్ టికెట్ లోని నిబంధనలను ఒకటికి రెండుసార్లు చదువుకుని కావలసిన వస్తువులు ముందు రోజునే సిద్ధంగా ఉంచుకోవడం వలన అభ్యర్థులు ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షకు హాజరు కావచ్చని ఎస్పీ  సూచించారు. వ్రాత పరీక్ష ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సూచించిన పరీక్ష సమయం పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటుగా ఏదైనా ఒక గుర్తింపు పత్రం ఒరిజినల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. పోలీసు అర్హత పరీక్షను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ విధించబడుతుందని. అభ్యర్థులు తమవెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు (మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోవద్దని తెలిపారు. పరీక్ష జరుగుతున్న సెంటర్లలోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, సంబంధిత అధికారులకు మినహా ఇతరులకు ప్రవేశం ఉండదని తెలిపారు. పరీక్ష అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఈసందర్భంగా అభ్యర్థులు, బయటి వ్యక్తులు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

ఈరోజు జె ఎన్ టి యు కళాశాల యందు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ లతో పరీక్ష కేంద్రాల నోడల్ ఆఫీసర్ డి. ఎస్.పి శ్రీ వెంకటరమణ పరీక్షల గురించి తగు సూచనలు చేశారు.

Please follow and like us:

You may also like...