ప్రపంచ వలసలపై సదస్సుకు ఆహ్వానం….!

తెలంగాణ నుండి ప్రపంచ వలసలపై థాయిలాండ్ లో సదస్సుకు  మంద 

హైదరాబాదు : వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్) అనే అంశంపై ఐక్యరాజ్య సమితి వారు రూపొందించిన తుది ముసాయిదాపై చర్చిండానికి ఈనెల 24-25 తేదీలలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియా ప్రాంతీయ సదస్సులో ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందంలో మంద భీంరెడ్డితో పాటు రఫీక్ రవుతర్, ఈశ్వరి (కేరళ), ఆశిం రాయ్ (ఢిల్లీ) ఉన్నారు. ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ అంతర్జాతీయ వలసలపై పనిచేసే పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, విద్యావేత్తలు, వలసలపై పరిశోధకులతో కలిపి ఈ ఆసియా స్థాయి సదస్సును నిర్వహిస్తున్నది.

‘రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసల కొరకు ప్రపంచ సంఘటిత ఒప్పందం’ (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్దర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్) గురించి ఐక్యరాజ్య సమితి లోని 193 దేశాలు చర్చిస్తున్నాయి. 19 సెప్టెంబర్ 2016 న ఐక్యరాజ్య సమితిలో శరణార్థుల మరియు వలసదారులకు సంబంధించిన న్యూయార్క్ ప్రకటనకు అనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ‘ప్రపంచ సంఘటిత ఒప్పందం’ ను అమోదింపజేయడానికి ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 10-11 డిసెంబర్ 2018 న మొరాకో లో సమావేశమై అంతర్జాతీయ వలసల పై వివిధ ప్రభుత్వాల మధ్య జరిగే రాయబార చర్చల సదస్సును నిర్వహిస్తుంది. సమావేశములో తుది ముసాయిదాను ఆమోదానికి సమర్పిస్తారు.

1970 నుండి ఈనాటివరకు భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు కొనసాగుతున్న వలసలపై అన్ని కోణాలను సంపూర్ణ, సమగ్ర పద్ధతిలో చర్చించనున్నట్లు మంద భీంరెడ్డి తెలిపారు. వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమంపై భారత్ తో సహా అన్ని గల్ఫ్ దేశాలు సానుకూల వైఖరి ప్రదర్శించడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న సదస్సులు తోడ్పడతాయని ఆయన అన్నారు. వలసల మీద పరిపాలనను మెరుగుపర్చడానికి, నేటి వలసలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి ఇలాంటిచర్చలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

Please follow and like us:

You may also like...