ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే!

  • ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ 
  • సమస్యాత్మక ప్రాంతాలపై కలెక్టర్, జేసీకి వివరిస్తున్న ఎస్పీ రమా రాజేశ్వరి

జోగులాంబ గద్వాల్ జిల్లా : 
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇక నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో సమస్యాత్మక, అతి సమస్యాత్మక, ప్రభావిత పోలింగ్‌ కేంద్రాల గుర్తింపునకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరుపుకోవడంలో ఈ ప్రక్రియ అత్యంత కీలకం అన్నారు. రెవెన్యూ, పోలీసు, జిల్లా అధికారులు పూర్తి సమన్వయంతో సమష్టిగా ముందుకు సాగాలన్నారు. సెక్టోరియల్‌ అధికారులతో కలిసి ప్రత్యేకంగా మార్గ సూచీలను పోలీసు, రెవెన్యూ అధికారులు రూపొందించాలని సూచించారు. ప్రవర్తన నియమావళిని అనుసరించి అన్ని స్థాయిల్లో ఎన్నికల కమిటీలు పకడ్బందీగా పనిచేయాలన్నారు. పార్టీలు, ప్రతినిధుల, అభ్యర్థుల సభలు, సమావేశాలకు, ర్యాలీకి ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అన్నారు. లౌడ్‌ స్పీకర్స్‌ అనుమతి లేకుండా ఎక్కడా ఏర్పాటు చేయవద్దని సూచించారు. అభ్యర్థుల ప్రచారాల్లో కుల, మత ప్రస్తావన రాకుండా చూడాలని, ప్రార్థన స్థలాల్లో ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో అనుమతులు లేని ప్లెక్సీలు, కటౌట్‌లు, బ్యానర్లు వెంటనే తొలగించాలన్నారు. వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అభ్యర్థికి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలు, కేంద్రాలపై.. : సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలపై జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి జిల్లా అధికారులకు వివరించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘాతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు

Please follow and like us:

You may also like...