నాడు పార్టీల్లో అల్లుళ్లే కీలకం…నేడు కొడుకులదే హవా…!

దేశ రాజకీయ వ్యవస్థలో ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. అవన్నీ ఒక కుటుంబం నుంచి ఆవిర్భవించిన పార్టీలే. ఆ కుంటుంబంలోని సభ్యులంతా పార్టీలో ముఖ్యపదవులు లేదా బాధ్యతలు తీసుకుంటుండగా… మిగతా వారికి మాత్రం నామమాత్రపు పదవులు మాత్రమే దక్కుతున్నాయి. ఇక తండ్రి పార్టీ నెలకొల్పిన సమయంలో కొడుకు ఇంకా రాజకీయాల్లో ఓనామాలు కూడా దిద్ది ఉండడు. కానీ కాలక్రమంలో పార్టీ పగ్గాలు అప్పుడే వచ్చిన కొత్త కోడిపిల్లకే దక్కుతాయి. అంతవరకు ఆ పార్టీకి పునాది రాయి పడినప్పటినుంచి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రం పార్టీ పగ్గాలు ఏమి ఉండవు. పైగా వారసుడిగా వచ్చిన కొడుకు అజమాయిషీ పార్టీ సీనియర్లపై మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు పార్టీ అధినేత తమ్ముడో, అల్లుడో, లేదా బావమరిదో పార్టీకి విశేష సేవలందించినప్పటికీ… పదవులు మాత్రం కొడుకుకే అప్పజెప్తారు పార్టీ అధినేతలు. దీంతో కొందరు అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చి తమ సొంత కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.అలాంటి పార్టీలను ఒక్కసారి చూద్దాం.

శివసేన నుంచి బయటకొచ్చి రాజ్‌థాక్రే కొత్త కుంపటి బాల్ థాకరే…మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ గుర్తుండిపోయే పేరు. తాను స్థాపించిన శివసేన పార్టీ మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. చాలాసార్లు కింగ్ మేకర్‌ పార్టీగా కూడా అవతరించింది. అప్పటి వరకు బాల్ థాకరేకు ప్రధాన అనుచరుడిగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన మేనల్లుడు రాజ్‌థాకరే ఒక్కసారిగా పార్టీ నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను 2006లో ఏర్పాటు చేశారు. ఇందుకు కారణం బాల్‌థాకరే తన రాజకీయ వారసుడిగా తన కొడుకు ఉద్ధవ్ థాక్రేను ప్రకటించారు. దీంతో అలక చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టాడు.

కరుణానిధి వారసుడిగా స్టాలిన్..అలక బూనిన అల్లుడు మురుసోలి మారన్ ఇక తమిళ రాజకీయాలు చూస్తే ద్రవిడ మున్నేట్ర ఖజగం (డీఎంకే) ఆనాటి అధినేత దివంగత కరుణానిధికి ముఖ్య అనుచరుడిగా ఆయన అల్లుడు కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత మురుసోలిమారన్ ఉన్నారు. వయస్సులో రాజకీయ అనుభవంలో సీనియర్ అయినప్పటికీ… పార్టీ పగ్గాలు మాత్రం కొడుకు స్టాలిన్‌కే అప్పగించారు. ఈ క్రమంలోనే క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటానని కూడా నాడు అంటే 2001లో మారన్ బెదిరించారు. కానీ ఆ తర్వాత నెమ్మదించి స్టాలిన్ నాయకత్వానికి ఓకే చెప్పారు. తర్వాత మారన్ కొడుకులు దయానిధి మారన్, కళానిధి మారన్‌లు పేరుకు మాత్రమే పార్టీలో ఉంటూ తమ వ్యాపారాలపై దృష్టి సారించారు.

ఇద్దరికీ వయస్సులో స్వల్ప తేడా.. రాజకీయ అనుభవంలో హరీష్ రావుదే పైచేయి ఇక కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.ఇక తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్‌లో కూడా కుటుంబ పాలనే ఉంది. ఈ పార్టీలో కూడా కొడుకు వర్సెస్ అల్లుడు అన్నట్లుగానే ఉంది. పార్టీ సుప్రీమ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొడుకు కే.తారకరామారావు (కేటీఆర్) హవా ప్రస్తుతం ఇటు పార్టీలో అటు ప్రజల్లో కొనసాగుతోంది. ఇక కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావుకు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక కేటీఆర్‌కు హరీష్ రావుల ఏజ్ గ్యాప్ కేవలం నాలుగేళ్లే. అయితే రాజకీయ అనుభవం మాత్రం హరీష్ రావుకే ఎక్కువగా ఉంది. కేటీఆర్ రాకతో హరీష్ రావును సైడ్ చేసేస్తున్నారంటూ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. బయటకు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఎవరి రిక్వైర్‌మెంట్స్ వారికి ఉన్నట్లు గులాబీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

పార్టీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గత కొన్నేళ్లుగా కేటీఆర్ హరీష్ రావుల మధ్య విబేధాలు వచ్చాయని చాలా మంది గులాబీ నేతలే చెప్పుకుంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక చిన్న పార్టీ మాత్రమే. కేవలం మూడో పార్టీగా మాత్రమే ఉండేది. అంతేకాదు పార్టీ స్థాపించిన కేసీఆర్ సామాజిక వర్గం తెలంగాణలో చాలా తక్కువగా ఉంది. అప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలన్నది ఒక ప్రతిపాదనగా మాత్రమే ఉండేది. రాజకీయంగా కూడా నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఎక్కువగా వినిపించేది కాదు. 2001లో టీడీపీ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని అయితే స్థాపించాడు కానీ.. కాంగ్రెస్ టీడీపీల చాటునే తన పార్టీని నడుపుకొచ్చాడు. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఆయన మేనల్లుడు హరీష్ రావు ఉన్నారు. 2004లో తొలిసారిగా హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ నుంచి కేసీఆర్ బయటకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే హరీష్‌రావు నడిచారు. అప్పటికీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కానీ కుమార్తె కవిత కానీ రాజకీయాల్లో లేరు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్‌కు నేతృత్వం వహించే నేత లేకపోయారు. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తన ఆమరణ నిరాహారదీక్షతో మళ్లీ తెలంగాణ ఏర్పాటు డిమాండ్ ఊపందుకుంది. హైదరాబాద్‌ హాస్పిటల్‌లో ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో తొలిసారిగా జర్నలిస్టులకు కేసీఆర్ కుమార్తె కవిత కనిపించారు. ఇక అప్పుడే ఆమె రాజకీయాల్లోకి వస్తారంటూ టాక్ నడిచింది. ఇదే సమయంలో కొడుకు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి హోదాలో జాతీయ వార్తా ఛానెల్స్‌లో తమ వాణి వినిపిస్తూ కనిపించారు.

2009 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజకీయాల్లోకి కేటీఆర్ అప్పటి వరకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండేవారు. 2009 ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే కేటీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సిరిసిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి వరకు పార్టీలో,ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు హరీష్ రావు. అసెంబ్లీలో ధీటైన కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు హరీష్ టీఆర్ఎస్ఎల్‌పీ బాధ్యతలు చేపట్టారు. ఇక అదే సమయంలో నాడు ఎంపీగా ఉన్న తండ్రి కేసీఆర్ ఢిల్లీలోని తన అధికార నివాసం నుంచే కుమారుడు కేటీఆర్, కవితలు జాతీయ ఛానెల్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరతను వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కేటీఆర్ కవితలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తులుగా ఎదుగుతారని అప్పుడే వార్తలు షికారు చేశాయి. ఇక 2014లో రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కొడుకు కేటీఆర్, కూతురు కవితలు కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నారనేది స్పష్టమైంది.

హరీష్ సన్నిహితులకు కేటాయించని టికెట్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌దే తొలి ప్రభుత్వం. ఇందులో కేటీఆర్‌కు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ ఐటీశాఖ బాధ్యతలు, మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించారు.ఇక కవిత తొలిసారిగా ఎంపీ అయ్యారు. కొడుకును రాష్ట్రంలో కూతురును లోక్‌సభకు పంపారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత పార్టీ ప్రభుత్వంలోకి రావడం వరకు కీలకంగా వ్యవహరించిన హరీష్‌రావుకు వ్యవసాయం, ఇరిగేషన్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ పోర్ట్ ఫోలియోలను కేటాయించారు. కానీ కేటీఆర్ రాకతో హరీష్ రావుకు తగిన ప్రాధాన్యత లభించలేదని ఇప్పటికీ కొందరు నేతలు చెబుతుంటారు. గత ఐదేళ్లలో ఐటీ మంత్రిగా కేటీఆర్ మంచి మార్కులు సంపాదించడమే కాదు పార్టీలో కేసీఆర్ తర్వాత రెండో స్థానానికి ఎగబాకారు. ఇదే సమయంలో హరీష్ రావు ఆ స్థానం అందుకోవడంలో విఫలమయ్యారు అని చెప్పడంకంటే కేసీఆర్ వారసుడు ఆయన్ను వెనకకు నెట్టేశారని చెప్పడం బాగుంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు 2019 ఎన్నికల టికెట్ల కేటాయింపులో టికెట్ ఆశించిన హరీష్ రావు సన్నిహితులను కేసీఆర్ పక్కకు పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కాస్త అలక వహించిన హరీష్ రావు ఒకానొక సందర్భంలో తను రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు బాహాటంగానే చెప్పారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ఇద్దరూ ఒకే వేదికపై నుంచి తాము ఒక్కటిగా ఉన్నామని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పారు. మొత్తానికి 2019 ఎన్నికలు టీఆర్ఎస్‌కు కీలకం కానున్నాయి. మహాకూటమిని ఎదుర్కొని విజయం సాధిస్తే పర్వాలేదు. ఒకవేళ ఓటమి మూటగట్టుకుంటే కేటీఆర్ గట్టి ఎదురుదెబ్బ ఎదుర్కోవల్సి వస్తుంది. మళ్లీ హరీష్ రావు పార్టీ బాధ్యతలు తీసుకుని తన రాజకీయ చుతరతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అదే టీఆర్ఎస్ గెలిస్తే నో డౌట్ ఇక ఆపార్టీ బాస్ కేటీఆర్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Please follow and like us:

You may also like...