Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నడిగడ్డ నుంచే సమరశంఖం….!


        అలంపూర్‌కు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక

జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతో శ్రీకారం
అలంపూర్‌ చౌరస్త్తా,
శాంతినగర్, అయిజల్లº రోడ్‌ షో

గద్వాలలో సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభ
హాజరుకానున్న విజయశాంతి, భట్టి

హామీలు మరచిన తెరాసను మట్టికరిపిస్తాం : డీకే అరుణ

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని తెరాసను వచ్చే ఎన్నికల్లో మట్టికరిపించడమే ధ్యేయంగా గురువారం అలంపూర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. మంగళవారం గద్వాలలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. అలంపూర్‌లోని జోగులాంబ, గద్వాల జమ్ములమ్మ ఆలయాల వద్ద అమ్మవారిని నేతలు దర్శించుకుంటారన్నారు.

జమ్ములమ్మ నుంచి ర్యాలీగా గద్వాల పాత బస్టాండుకు చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం లాంఛనమేనని, తెరాస పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారన్నారు. అమలుకాని హామీలతో జనాలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ అందరి ఆమోదంతో పార్లమెంటులో తెలంగాణా బిల్లును పాస్‌ చేయించి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారన్నారు.

ఇంటింటికీ ఉద్యోగం, రెండు పడకగదుల ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతారని ప్రశ్నించారు.

మిగులు బడ్జెటు ఉన్న రాష్ట్రం అంటూనే తెలంగాణను అప్పులపాలు చేస్తున్నారని, రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, కాంగ్రెస్‌ మేనిఫెస్టో గురించి పెద్దఎత్తున ప్రచారం చేస్తామన్నారు.

ముందస్తు ఎన్నికల సమరశంఖాన్ని కాంగ్రెస్‌ పార్టీ నడిగడ్డ నుంచి పూరించనుంది. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి సన్నిధిలో గురువారం పూజల అనంతరం ఎన్నికల జైత్రయాత్రకు పార్టీ సిద్ధమవుతోంది. పాలమూరు నుంచి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండటంతో జిల్లా నాయకత్వం ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి, ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క, వైస్‌ ఛైర్‌పర్సన్‌ డీకే అరుణలతో పాటు ఎన్నికల కమిటీల ఛైర్మన్లు, పార్టీ ఇతర నేతలు హాజరవుతున్నారు. ముఖ్య నేతలు హైదరాబాదు నుంచి హెలిక్యాప్టరు ద్వారా ఉదయం 11.00 గంటలకు అలంపూర్‌కు చేరుకుంటారు. జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక.. ప్రచారాన్ని ప్రారంభిస్తారు. కాంగ్రెస్‌ పార్టీకి దక్షిణ తెలంగాణలోని పూర్వ మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లº బలమైన నాయకత్వం ఉంది. 2014 ఎన్నికల్ల్లº తెరాస ప్రభంజనంలోనూ పాలమూరు నుంచి కాంగ్రెస్‌ అయిదు స్థానాలను గెలుచుకుంది. గద్వాల, అలంపూర్, కల్వకుర్తి, వనపర్తి, మక్తల్‌ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రం మొత్తం తెరాస గాలులు వీచినప్పటికీ పాలమూరు నుంచి గౌరవప్రదమైన స్థాయిలో 5 స్థానాలు గెలుపొందడం కాంగ్రెస్‌కు ఊరట కలిగించింది. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రాబోయే ఎన్నికల్లº మరిన్ని స్థానాల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పార్టీ భావిస్తోంది. బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో మంచి పట్టు ఉండటంతో ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్‌ చేయాలని పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో ఏఐసీసీ కార్యదర్శులుగా చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డిలను నియమించారు. సీనియర్‌ నేతలు జైపాల్‌ రెడ్డి, డీకే అరుణ, ఇటీవల కాంగ్రెస్‌లో చేరి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్‌రెడ్డి.. ఇలా ముఖ్య నేతలంతా ఇక్కడే ఉండటం, గత ఎన్నికల్లో ఓ స్థాయి ఫలితాలు రావడంతో ఎలాగైనా పాలమూరు నుంచి విజయఢంకా మోగించాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌లో సంపత్‌కుమార్, గద్వాలలో డీకే అరుణ, వనపర్తిలో చిన్నారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ స్థానాలు మళ్లీ నిలబెట్టుకోవడంతోపాటు సాధ్యమైనంత ఎక్కువ మెజార్జీని సాధించుకోవాలని వ్యూహాత్మకంగా నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, మక్తల్‌ స్థానాల్లోనూ మహాకూటమితో కలిసి పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మిత్రపక్షాలకు రెండు నుంచి మూడు సీట్లు కేటాయించినా తతిమ్మా స్థానాలు ఎలాగైనా దక్కించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే పాలమూరు నుంచి ఎన్నికలను ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కార్యక్రమం ఇలా.. : గురువారం ఉదయం 11.00 గంటలకు హెలిక్యాప్టరు ద్వారా కాంగ్రెస్‌ అగ్రనేతలు అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జోగులాంబ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అలంపూర్‌ నుంచి ప్రారంభమయ్యే రోడ్డు షో అలంపూర్‌ చౌరస్తా, శాంతినగర్, అయిజ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. రోడ్డు షో అనంతరం సాయంత్రం గద్వాలలోని జమ్ములమ్మ దేవాలయానికి చేరుకొని నేతలు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి గద్వాల పట్టణంలోని రాజీవ్‌చౌక్‌ చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు జరిగే బహిరంగ సభలో ముఖ్య నేతలు ప్రసంగిస్తారు. అలంపూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, గద్వాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఎన్నికల ప్రచార ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Please follow and like us:

You may also like...