దొరలు, ప్రజల మధ్యే పోరు అంటున్నభట్టి..!

ప్రజల అవసరాలు, ఆకాంక్షలే అజెండా…

  • కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించారు…
  • బహిరంగ సభలకు రాహుల్, సోనియా…మల్లు భట్టి విక్రమార్క.
  • ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు… డీకె అరుణ.
  • యుద్దానికి సిద్ధం అవుతున్నాం… విజయశాంతి.

తెలంగాణలో ఒక నియంత పాలన, నిరంకుశ పాలన సాగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో దొరలకు, ప్రజలకు మధ్య పోరాటం సాగుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను అజెండాగా ప్రచారం చేస్తామని, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్ ను ఓడించే వ్యూహంతో పనిచేస్తామని అన్నారు.

శనివారం నాడు గాంధీభవన్లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కొట్లాడి, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం, టీఆర్ ఎస్ నాయకత్వం భ్రష్టు పట్టించిందని తెలంగాణ దోపిడీకి, అన్యాయానికి గురయిందని భట్టి విమర్శించారు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఒక్క కేసిఆర్ కుటుంబమే తెలంగాణ ఫలాలను అనుభవిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు చేసిన వారు తెలంగాణ సాధించుకున్న తరువాత జరుగుతున్న పాలనపై కూడా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

సర్కార్‌ను దించేందుకు అన్ని వర్గాలు కలిసి రావాలి

ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో, నేడు తెలంగాణలో ఏమి జరుగుతుందో విశ్లేషించుకోవాలని, కవులు, కళకారులు, మేధావులు, విద్యావంతులు, యువకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా తంత్ర వాదులు కాంగ్రెస్తో కలిసి వచ్చి టిఆర్ ఎస్ ఓడించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజా కవి గద్దర్, ప్రజా కళకారులు విమలక్క, గోరేటి వెంకన్న తదితరులంతా తమ ప్రచారంలో భాగస్వాములు కావాలని, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్కు మద్దతు పలకాలని ఆయన అన్నారు.

ఈ ఎన్నికలు చైతన్య వంతులైన తెలంగాణ ప్రజలకు, నియంతలా పాలన సాగిస్తున్న దొరలకు మధ్య జరుగుతున్న పోరాటమని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. రాష్ట్రంలో స్వేచ్చ, భావ ప్రకటన లేకుండా పోయాయని, ప్రశ్నించే గొంతులను నులిమివేస్తున్నారని, అక్రమ కేసులతో, అరెస్టులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసిఆర్ బెదిరింపులకు ఎవరు భయపడేది లేదని, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటాలు చేయడానికి ఎప్పుడు వెనకాడదని ఆయన అన్నారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో ఎందుకు జరపాల్సి వస్తుందని, ఈ విషయంలో ప్రజలు కేసిఆర్కు తగిన బుద్ది చెప్పి కాంగ్రెస్ను గెలిపించాలని అన్నారు.

సభలకు సోనియా, రాహుల్

తెలంగాణలో జరిగే ఎన్నికల సభలలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియగాంధీలు పాల్గొంటారని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించేది, మేనిఫేస్టోను ఎలా ప్రజలలోకి తీసుకెళ్ళాలో కాంగ్రెస్కు బాగా తెలుసునని భట్టి ఈ సమావేశంలో అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కమిటీ సలహాదారు సినీనటి విజయశాంతి, కో చైర్మన్ డికె అరుణ, సభ్యులు దాసోజు శ్రవణ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారద, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు వెంకట్, ఉపాధ్యక్షులు కుమార్ రావు, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ లాల్, హర్కర వేణుగోపాల్, అధికార ప్రతినిధులు మానవతారాయ్, చామల కిరన్ రెడ్డి, కురవ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు: డీకె అరుణ

టీఆర్‌ఎస్ మోసాలను ప్రజలలోకి తీసుకెళ్లి ఓడించి తీరుతామని, కేసీఆర్ పాలన పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని, ప్రజలను ఓట్లు అడిగే హక్కు టిఆర్ ఎస్కు , కేసిఆర్కు లేదని డీకే అరుణ ఆక్షేపించారు.

యుద్దానికి సిద్ధం అవుతున్నాం: విజయశాంతి

తెలంగాణ ప్రజలు సాధించుకున్నారని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఒక నియంత పాలన సాగుతుందని, ప్రజలు కేసిఆర్ కుటుంబంపైన యుద్దానికి సిద్దమయ్యారని సినీ నటి, ప్రచార కమిటీ సలహాదారు విజయశాంతి అన్నారు. ప్రజలు కేసీఆ్పన, టీఆర్ ఎస్ పాలనపైన యుద్దానికి సిద్దమయ్యారని ప్రజలే విజయం సాధించి తీరుతారని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అన్నా చెల్లెల్ల మధ్య జరుగుతున్న యుద్దంగా అమే అభివర్ణించారు. కేసీఆర్ పరీక్ష రాశారు. ఫలితం తర్వాత వస్తుందని విజయశాంతి చెప్పకొచ్చారు

Please follow and like us:

You may also like...