దేశం ఎటెళ్తోందో…?

మనదేశంలో మత్తు పదార్థాలకు కొదవలేదు. చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా, సారా, విస్కీ, బ్రాందీ, ఎల్.ఎస్.డి ఇలా తెలిసిన తెలియని ఎన్నో మత్తుపదార్థాల బారినపడి ఈ దేశం నిషాలో జోగుతోంది.
ఈ మత్తుకు ఎన్నో కొన్ని లెక్కలు ఉన్నాయి. ఈ నిషా లోతు, విస్తృతి, సమాజ స్పృహలో ఉన్నవే!

ఇవిగాక అసలు సమాజ స్పృహలో లేని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకర మత్తు పదార్థాలు చాలానే ఉన్నాయి. ఇవి సామాజిక క్షేత్రములో వేళ్లూనుకుని, ఊడలుదిగి, జడలు విప్పుకుని, చిలవలుపలవలుగా విస్తరించి ఉన్నాయి.

వీటి విషపు గాలులు యావత్ సమాజాన్ని ఆవరించి, మానవ మేధస్సును కొల్లగొట్టి పిప్పి చేస్తున్నాయి. అసలు హేతుబద్ద ఆలోచనని సమూలంగా హరించివేస్తున్నాయి.

ఏమిటి విష మత్తు పదార్థాలు? ప్రధానంగా చెప్పుకోవాల్సినవి…

1. దైవ, మత, జాతి, కుల భావనలు! ఈ భావనల నుండి పుట్టుకొచ్చిన ఇంకా నిరంతరం పుట్టుకొస్తున్న మూఢనమ్మకాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు

2. కులవ్యవస్థ, అగ్రకుల పెత్తనం, అంటరానితనం, సామాజిక అసమానతలు.

3. ఆర్థిక దోపిడి, ఆర్థిక అసమానత, పీడనం, హింస, దౌర్జన్యం.

4. పురుషాధిక్యత, పురుషాహంకారం, వివక్ష, అణచివేత, లైంగిక ఉన్మాదం.

5. బూటకపు ఎన్నికల రాజకీయం
6. సరుకుల ఆరాధన!

7. పర్యావరణ పరిరక్షణ రాహిత్యం.
8. సమిష్టి జీవన రాహిత్యం!

మానవ సమాజం తన పరిణామ క్రమంలో అత్యంత ఆదిమ దశ నుండి అతీతశక్తులను, దైవభావనను, దైవరూపాలను సృష్టించుకుంటూ పలు ఆద్యాత్మిక చింతనలను, మతాలను సృష్టించుకుంటూ పెంచిపోషించుకుంటూ వచ్చింది.

అజ్ఞానపు చీకటి యుగాలు దాటుకొని విజ్ఞానపు వెలుగు లో ప్రవేశించింది. అయితే శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక వెల్లువలో ఉరకలెత్తుతున్న నేటి ఆధునిక మానవుని కన్నా, వీటి వెలుగులు ప్రసరించని అంధయుగపు మానవుడే మంచి సామాజికుడు, పర్యావరణ హితుడు, నీతిమంతుడు అని చెప్పాల్సిన స్థితికి ఇప్పటి మానవ సమాజం దిగజారింది.

Please follow and like us:

You may also like...