Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తెలంగాణమా… ఇదే నీ గమనమా?

తెలంగాణ /హైదరాబాదు: ఎన్నో రోజుల పోరాటం, ఎన్నెన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమం జరిగినన్నాళ్లు, ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కోసం నినదించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తమ కష్టాలు, కన్నీళ్లు పోయి, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అందరూ ఆశించారు. స్వయంపాలనతో పాటు, మా నీళ్లు, నిధులు మాకు దక్కుతాయని, మా కొలువులు మాకొస్తాయని ప్రతి ఒక్కరు నినదించారు. తెలంగాణ ఏర్పడి ఐదో ఏట, రెండోసారి ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అంతా అనుకున్నట్టే జరుగుతోందా అని ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నిజంగా తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచినా, ఓడినా, దాన్ని ఒక ఉద్యమ పార్టీగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ వేదికగా చూసారు తప్ప, ఫక్తు రాజకీయ పార్టీగా చూడలేదు. ఆ పార్టీ నాయకత్వం వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలను, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆ పార్టీ అధికారం కోసం ప్రాకులాడదని, ఆ పార్టీ అధినాయకత్వం పదవులు చేపట్టదనీ చెప్పిన మాటలను తెలంగాణ ప్రజానీకం నమ్మింది. ఇగ బయటి ప్రపంచం కూడా తెలంగాణ ఉద్యమ ఉనికిని, ఉధృతను, ఆ పార్టీ గెలుపోటములనే ప్రామాణికంగా చూసారు. అందుకే, ఎవరు ఏ పార్టీలో ఉన్నా, టీఆర్‌ఎస్ గెలవాలని, నిలబడాలని కోరుకున్నారు

ఆ పార్టీని తెలంగాణ సమాజం అంతగా ఓన్ చేసుకుంది. 2014 లో అప్పటి పరిస్థితుల ప్రభావం కావొచ్చు, ఉద్యమ ఊపు కావొచ్చు, తెలంగాణ ఏర్పాటు అవుతున్న శుభ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేబడితే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తుదన్న నమ్మకంతో, ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ప్రత్యేక రాష్ట్ర ఆశయాన్ని సజీవంగా ఉంచిన ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు అధికారాన్ని అప్పగించారు. ఏదేమైనాఆ పార్టీ నాయకత్వం ఉద్యమ కాలంలో చెప్పిన అంశాలకు, కల్పించిన ఆశలకు కట్టుబడి పాలన సాగిస్తుందని సామాన్య ప్రజలతో పాటు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు సబ్బండ వర్గాల వారు అందరూ అనుకున్నారు.

కానీ, అధికారం చేబట్టిన కొద్ది రోజులకే, ‘మాది అహోబిలం మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ‘ అని చెప్పి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నాయకులను అవసరం లేకున్నా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతో, ప్రజల కళ్ల ముందున్న తెరలు తొలగడం ప్రారంభమయ్యాయి. అయినా సరే, మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, కొత్త ప్రభుత్వం కనుక బాలారిష్టాలు దాటడానికి కొంత సమయం పడుతుందని, ప్రభుత్వం ఏం చేసిన సంయమనం పాటించారు. మొదటి మూడేళ్లు తెలంగాణ ప్రభుత్వం, ఆడిందే ఆట, పాడిందే పాట లాగ పాలన సాగింది. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, అది కూడా నాయకుని వ్యక్తిగత ఆలోచనలే ప్రభుత్వ విధానాలుగా, పథకాలుగా, ప్రాజెక్టులుగా అమలవుతున్న వేళ, ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయాలు మొత్తం వ్యక్తి, కుటుంబ కేంద్రంగా జరుగుతున్న వేళ, ఆ నిర్ణయాలు తెలంగాణ సమాజం మొత్తానికి కాకుండా కేవలం కొన్ని వర్గాలకే మేలు చేసే విధంగా ఉన్న వేళ, సమాజంలో కొంతలో కొంత కదలిక రావడం సహజం గానే మొదలయ్యింది.

రైతుల ఆత్మహత్యలు ఆగకపోవడం, ప్రాజెక్టుల పేరుతో సాగు భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నించడం, నిరుద్యోగుల్లో పెల్లుబికుతున్న అసంతృప్తి, తెలంగాణ ఏర్పడ్డాక సగటు ప్రజానీకానికి జరిగిన మేలు ఏమిటి అని చర్చ జరుగుతున్న తరుణంలో, ఉద్యమ స్వభావమున్న తెలంగాణ పౌర సమాజం కొన్ని ఆందోళనలకు పిలుపినిస్తున్నప్పుడు, వారితో చర్చించి పాలనలో భాగస్వాములను చెయ్యాల్సింది పోయి, ప్రభుత్వం అణచివేతకు పాల్పడింది. అడుగడుగునా అరెస్టులు చెయ్యడంతో పాటు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఆంక్షలు, ధర్నా చౌక్ మూసివేత వంటి నిర్ణయాలు ప్రభుత్వం మీద, టీఆర్‌ఎస్ నాయకత్వం మీద తెలంగాణ సమాజానికున్న భ్రమలు పూర్తిగా తొలగిపోయేలా చేశాయి. ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉన్న శక్తులు టీఆర్‌ఎస్ పార్టీకి దూరం జరగడం మొదలుపెట్టాయి.

ఉద్యమ కాలంలో, తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రతి ఉద్యమకారుడు అనర్గళంగా వివరించేవారు. నిజంగా ఆ చరిత్ర, సమస్యల మీద పూర్తి అవగాహన లేని వాళ్ళు కూడా అందుబాటులో ఉన్న వివిధ రకాల సాహిత్యం ద్వారా కూలంకషంగా అధ్యయనం చేసి మరీ ఉద్యమాన్ని వ్యతిరేకించేవాళ్ళకి, అవహేళన చేసిన వాళ్లకి ధీటుగా సమాధానం చెప్పారు, ఊరూరా తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అదే విధంగా 14 ఏళ్ల ప్రజా పోరాటంగా ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమం నుండి ఒక బలమైన, ప్రజా సమస్యల మీద విషయ పరిజ్ఞానం ఉన్న కొత్త రాజకీయ నాయకత్వం ముందుకొస్తుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో అటువంటి కొత్త తరం నాయకత్వమే పగ్గాలు చేబడుతుందని ఆశించాము. కానీ, దానికి భిన్నంగా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో, అధికార పార్టీలో ఎక్కువ శాతం వేరే పార్టీల్లోంచి అదే పాత నాయకత్వం వచ్చి చేరింది.

చాలా తక్కువగా కొత్త వారికి అవకాశాలు దక్కాయి, వారు కూడా పార్టీ అధినాయకత్వానికి లోబడి, వారి నీడన , వారి నడతనే అనుసరిస్తున్నట్టుగా ప్రస్ఫుటమవుతోంది. ఈ కొత్త నాయకత్వం ఎదగాలంటే, వారికి విషయ పరిజ్ఞానం, ప్రజలతో సత్సంబంధాలు అవసరమన్నది ఎంత వరకు గ్రహిస్తున్నారో ప్రశ్నార్థకమే. పాలన అంతా ఏకపక్షంగా జరుగుతున్న తరుణంలోనే, ఆవు చేలో మేస్తే… దూడ గట్టున మేస్తదా అన్న చందంగా, టీఆర్‌ఎస్ పార్టీ దిగువ స్థాయి నాయకత్వం కూడా, అధినాయకత్వం , వారి కుటుంబం అడుగులకు మడుగులొత్తుతూ ఎటువంటి ప్రజాస్వామ్యస్ఫూర్తి లేకుండా, అవతలి పక్షాన్ని విమర్శించడం, ప్రతిపక్షాలను అవమానపరచడమే తమ నాయకత్వ లక్షణంగా భావించి, ప్రభుత్వానికి ఎవరు ఏ చిన్న సూచన చేసినా దాన్ని ఘాటైన పదజాలంతో దూషించడమే తమ కర్తవ్యంగా చేసుకున్నారు.

ఇది రాను రాను మరింత దిగజారిపోయి, గల్లీ లీడర్ల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, అవతలి వారిని ఎంత గట్టిగా అదరగొడుతూ మాట్లాడితే అంత పెద్ద లీడర్ అన్న అభిప్రాయం నెలకొన్నది. ఇదొక విచిత్రమైన ఆందోళనకరమైన ధోరణి. తెలంగాణ ఉద్యమ అనంతరం ప్రజా ప్రతినిధులుగా ఆవిర్భవించిన కొత్త నాయకత్వంలో ఈ పోకడ మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఏదన్న ఒక విషయం మీద నిలకడగా విశ్లేషించి మాట్లాడగలిగిన లీడర్లు చాల తక్కువ మంది కనిపిస్తున్నారు. విషయం పరిజ్ఞానం లేకున్నా, అవతలి వాడిమీద మాటల దాడి, లేదంటే గత పాలకుల మీద నెపం నెట్టి గొంతు చించుకొని అరిస్తే అదే గొప్ప నాయకత్వ లక్షణంగా పరిగణిస్తుండటం విచారకరం. ఇదే ధోరణి ప్రతిపక్షాలలో కూడా ఉండటం మరీ ఆందోళనకరం. వారిలో కూడా టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఎంత తక్కువచేసి మాట్లాడితే అంత పెద్ద లీడర్ అన్న భావన ఒకటి సృష్టించడం జరుగుతోంది. ఇగ ప్రతిపక్ష పార్టీల్లో కొత్త నాయకత్వానికి అసలేమాత్రం అవకాశాలు దక్కినట్టు కనిపించడం లేదు.

ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే కాలంలో తెలంగాణ సమాజానికి నాయకత్వలేమి ఏర్పడుతుందనడానికి ప్రస్తుత పరిస్థితిని బట్టి చెప్పొచ్చు. అధికార పార్టీలోని నాయకత్వమేమో, అధినాయకత్వం కనుసన్నల్లో ఉంటూ, ప్రతిపక్ష పార్టీలను ఎంత తీవ్ర పదజాలంతో తిడితే అంత గొప్ప, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులకేమో అధికార పార్టీ నాయకత్వాన్ని ఎంత దూషిస్తే అంత గొప్ప లీడర్ అన్న భావన కల్పిస్తున్నారు. ఈ పరస్పర దూషణలనే ప్రజలు ఆదరిస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. ఇది నిజంగా చాలా విచిత్రమైన ఆందోళనకరమైన పరిస్థితి. ఇది టీవీ రేటింగుల్లాగానే, ప్రజలు ఏం చూస్తే మేము అదే చూపిస్తున్నామనే వాదనతో ఏవేవో పిచ్చి ప్రోగ్రాములు టెలికాస్ట్ చేసినట్టు, ఈ నాయకులు కూడా విషయాన్ని పక్కనబెట్టి తిట్ల పురాణానికే ప్రాధాన్యతనిస్తున్నారు. పాత, కొత్త రాజకీయ పార్టీల్లో, అధికార ప్రతిపక్షాలలో మాట్లాడిన నాయకులందరూ, తెలంగాణాలో ఇట్లనే ఉండాలి, ప్రజలు ఇట్లా ఉంటేనే ఆదరిస్తారు, ఓట్లేస్తారు అని అనుకుంటున్నారు. విషయంమీద మాట్లాడితే మేధో వర్గమంటారు గాని, నాయకుడనరు, ఓట్లు పడవు అనే వాదన లేవనెత్తుతున్నారు.

తెలంగాణాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల నుంచి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారు నిజంగా ఒక ఎమ్మెల్యే గా ఎన్నికైతే, నియోజకవర్గానికి ఏం చేస్తావో 5 నిముషాలు ఆగకుండా చెప్పమంటే, నూటికి తొంబై మంది అర నిమిషం కూడా చెప్పలేరన్నది నిజం. ప్రజల సమస్యల మీద గాని, శాసన నిర్మాణ ప్రక్రియ మీద గాని వీరికి ఎలాంటి అవగాహనా లేదనేది వారితో చర్చిస్తున్నప్పుడు గమనించిన అంశం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేసి ఎమ్మెల్యే అయిపోవాలనే ఆరాటం తప్ప, నిజంగా ప్రజల సమస్యలేమిటి, వాటిని పరిష్కరించడానికి నిన్నే ఎందుకు ఎన్నుకోవాలంటే, ఎంత మంది సమాధానం చెప్పగలుగుతారో అనుమానమే. వీరికున్న ఒకే ఒక ఆయుధం, అవతలి పక్షాన్ని నిందించడం, విమర్శించడం తప్ప తామేమి చెయ్యాలో అనే ఆలోచన రాకపోవడం నిజంగా విడ్డూరం.

ఇటువంటి వారే, ఉద్యమం పేరు జెప్పి అన్ని పార్టీలలో పాగా వేసి, మాకు టిక్కెట్లివ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టుగా కనబడుతోంది. అవకాశమొస్తే చాలు ఏ పార్టీ అయినా ఫర్వాలేదు, ఎలాగైనా గెలిచేస్తే చాలు అన్నచందంగా వీరు రాజకీయం చెయ్యడం చూస్తుంటే ఆందోళన కలగక మానదు. సుదీర్ఘంగా సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో, ప్రజాసమస్యల కోణంలో ఉద్యమాన్ని ముందుండి నడిపినవారు, విషయం పరిజ్ఞానం ఉన్న చాలా మంది తెరమరుగయ్యారు, లేదంటే తెరమరుగుచెయ్యబడ్డారు, ఎదో కొద్దీ మంది అక్కడక్కడా కనిపిస్తున్నారు. పాద పూజలు, పాలాభిషేకాలు చేసే నయా భట్రాజులు, అలా వ్యక్తిపూజ చేపించుకునే ఇంకో కొత్త రకం నాయకులు రోజు రోజుకి ఎక్కువయిపోతున్నారు.

ఇట్లా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని, ఏ పార్టీకి సైద్ధాంతిక బాంధవ్యం లేని నాయకత్వం ఇలాగే కొనసాగితే, రాను రాను ప్రజాసమస్యలు మరుగునపడిపోయి, కేవలం వ్యక్తిగత విమర్శలు, లేదంటే డబ్బు ప్రవాహమే రాజకీయాలు అనే పరిస్థితికి తెలంగాణ రాజకీయాలు చేరుకుంటాయి. రానున్న తరాలు రాజకీయాలంటే ఒక ప్రజా సంబంధాలు లేని, జుగుప్సాకరమైన వ్యాసంగంగా అసహ్యించుకునే పరిస్థితులు తలెత్తవచ్చు. ఈ పరిస్థితికి కారణమైన అన్ని పార్టీలు ఒకసారి తీవ్రంగా ఆలోచన చెయ్యాల్సిన అవసరముంది. ఈ ఎన్నికల సమయంలో ఎటువంటి వారికి టిక్కెట్లిస్తున్నాం, ఎలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాము అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.

గెలుపే ధ్యేయంగా, అసలు ఉద్యమంతో, ప్రజల సమస్యలతో సంబంధంలేని వారిని నాయకులుగా చెయ్యడం ఎంత వరకు సబబు అనేది, సుదీర్ఘంగా ఉద్యమ పార్టీగా చెలామణి అయిన టీఆర్‌ఎస్ పార్టీతో పాటు, మిగిలిన పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. కొత్త సీసాలో పాత సారా మాదిరిగా కాకుండా, ఒక నిజమైన నాయకత్వాన్ని పెంపొందించుకోకుంటే రానున్న రోజుల్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన దోషులుగా అన్ని పార్టీలు బాధ్యత వహించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు, సమాజం కూడా తాము ఎలాంటి వారిని నాయకులుగా కోరుకుంటున్నామో, కనీసం ఈ ఎన్నికలలో అయినా తమ ఓటు ద్వారా తెలియపర్చాలి. కేవలం వివిధ పార్టీలిచ్చే పైసలకో, క్వార్టర్ సీసాలకో ఆశపడితే…. నిజంగా ఇదే తెలంగాణ గమనమా అనే ప్రశ్న ఉత్పన్నమయితది.

Please follow and like us:

You may also like...