తెరాస పాలనకు చరమగీతం కాంగ్రెస్‌ నేతల పిలుపు…!

కొల్లాపూర్‌ : మోసాలతో అధికారంలోకి వచ్చిన తెరాస పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొల్లాపూర్‌లో పార్టీ రోడ్డు షో, ప్రజాగ్రహ సభ నిర్వహించారు. హెలికాఫ్టర్‌లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క, సహ ఛైర్‌పర్సన్‌ డీకే అరుణ, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌ కొల్లాపూర్‌కు చేరుకున్నారు. పట్టణం వెలుపల అటవీశాఖ టింబర్‌ డిపో నుంచి సభావేదిక రాజాబంగ్లా వరకు ప్రచార వాహనంపై అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య మాట్లాడుతూ.. కేసీఆర్‌ను మాయల మరాఠిగా అభివర్ణించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా గెలుస్తూ మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, పరిశ్రమలు కూడా తేలేదని విమర్శించారు. డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఏం చేశావని సంబరాలు నిర్వహించావంటూ మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే కేఎల్‌ఐ చేపట్టి పొలాలకు సాగునీరు ఇచ్చారన్నారు. సోమశిల వంతెన నిర్మాణం చేపట్టలేదని, శ్రీశైల నిర్వాసితులను పట్టించుకోలేదని విమర్శించారు. ఇన్నిసార్లు జూపల్లికి అవకాశం ఇచ్చిన కొల్లాపూర్‌ ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. శ్రీశైలం నిర్వాసితులు, మాదాసి. మాదారి కురువల సమస్యలు పరిష్కరిస్తానని, పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. సీఆర్‌ జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ తెరాస ఓటమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌ సభకు వచ్చిన పార్టీ అగ్ర నేతలను బీరం ఘనంగా సన్మానించారు. పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు జగన్‌మోహన్‌రెడ్డి, రంగినేని జగదీశ్వరుడు, లొంక హర్షవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి డా.కేతూరి వెంకటేష్, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కిషన్‌నాయక్, కిషాన్‌ సెల్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ యాదవ్, నేతలు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్మకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

పోటాపోటీగా నినాదాలు.: బహిరంగ సభలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సీఆర్‌ జగదీశ్వర్‌రావు మద్దతు దారులు పోటీపోటీగా నినాదాలు చేశారు. ముందుగా హెలిప్యాడ్‌ వద్ద నేతలకు స్వాగతం, సన్మానాల వద్ద పోటీ పడ్డారు. సభలో ఇరువర్గాల నినాదాలు మిన్నంటాయి. తోపులాటతో వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్‌ విరిగి పడడంతో ప్రజలు కింద పడ్డారు. ఎలాంటి చలువ పందిళ్లు ఏర్పాటు చేయకున్నా ప్రజలు ఎండలోనే నిలబడి నేతల ప్రసంగాలు విన్నారు.
ఉపాధ్యాయవర్గాన్ని కేసీఆర్‌ నట్టేట ముంచారు
పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : నాలుగున్నర ఏళ్లలో తెలంగాణలో ఉపాధ్యాయ వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నట్టేట ముంచారని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా ఏకమై తెరాసకు గుణపాఠం చెప్పకుంటే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఉపాధ్యాయుడు కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని ఆయన కోరారు. సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులు అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ ఫలాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసినవేనని గుర్తు చేశారు. 1982లో జీవో 88 అమలు చేసి ఉపాధ్యాయులకు పింఛను విధానం అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ఉపాధ్యాయుల అప్రెంటీస్‌ విధానాన్ని కూడ కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇటీవల తెలంగాణలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల నియామక రాతపరీక్షలో మాత్రం ఎంపికైన వారు రెండేళ్ల పాటు అప్రెంటీస్‌ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక పదోన్నతులు నిలిపివేశారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి కేసీఆర్‌ హాజరు కాలేదంటే ఉపాధ్యాయ వర్గాల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌పై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కొందరు పోలీసుల సహకారంతో ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనాయకుల ఫోన్లను, కాంగ్రెస్‌ పార్టీ అభిమానుల ఫోన్లను ట్యాంపరింగ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. ఫోన్లను ట్యాంపరింగ్‌ చేసి బ్లాక్‌ చేయడం మానుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
సోనియా ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా..
ప్రచార తార విజయశాంతి

అచ్చంపేట పట్టణం : ‘ఎన్నికల హామీల్లో తెరాస ప్రభుత్వం ఒక్కటైనా అమలు చేసిందా? నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్కటి జరిగింది? సోనియాగాంధీ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా.. 2014 ఎన్నికల్లో పొరపాటున తెరాసకు ఓటేసి తప్పు చేశాం. మరోసారి ఆ తప్పు చేయొద్దు. తెరాసను గద్దెదింపి దొరలపాలనను తెలంగాణ నుంచి తరిమికొడదాం..’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ విజయశాంతి వాక్బాణాలు సంధించారు. శుక్రవారం జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోలో విజయశాంతితో పాటు, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొల్లాపూర్‌ నుంచి అచ్చంపేటకు హెలికాప్టర్‌లో చేరుకున్న పార్టీ అగ్రనేతలకు మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ, ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలికారు. పట్టణంలోని కన్నయ్య రైస్‌మిల్లు ఆవరణలో ప్రత్యేక ప్రచార వాహనంపై నుంచి విజయశాంతి ప్రసంగించారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు ప్రజల ఆత్మగౌరవానికి.. తెరాసకు మధ్యన జరుగుతున్నవని ఆమె అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బాగుపడిందని కేవలం ఆ నలుగురేనని పరోక్షంగా కేసీˆఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీˆఆర్‌ దోచుకున్నది ఇక చాలని, ఈసారి మోసపోయేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరని అన్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్‌ సత్తా చాటుతుందని, అప్పుడే ప్రజలకు మంచిరోజులు మొదలవుతాయని చెప్పారు.

  • భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి ప్రజా ప్రభుత్వాన్ని సాధిస్తామని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఇక్కడ హాజరైన జనాన్ని చూస్తుంటే అచ్చంపేట కదిలొచ్చిందా.. అన్నట్లుగా ప్రభంజనం ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీ అభ్యర్థి డా.వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు.
  • కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభకు కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. విజయశాంతి మాట్లాడుతున్న సమయంలో ఆమె తనను ఒసేయ్‌ రాములమ్మగా పిలవాలని చెప్పడంతో ప్రాంగణమంతా ఈలలు, కేరింతలో దద్దరిల్లిపోయింది. గిరిజన మహిళలు లంబాడీ డ్రస్సును బహూకరించి అభిమానాన్ని చాటుకున్నారు. సభావేదిక చాలకపోవడంతో ఎక్కువ మంది సమీపంలోని భవనాలు, గోడలపై నిలబడి వీక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీˆ సభ్యులు డా.అనురాధ, సరిత, ధర్మానాయక్, ఎంపీˆˆపీˆ భాగ్యలక్ష్మి, నేతలు పాల్గొన్నారు.
Please follow and like us:

You may also like...