టీఆర్ఎస్ లో అగులు బుగులు…

  • టిక్కెట్ ఆశించి అసమ్మతి రాగం  …
  • రెబల్స్‌ సంఖ్య భారీగా…
  • స్వతంత్ర అభ్యర్థులుగా అధికులు పోటీ…
  • అసమ్మతి వర్గాలు ర్యాలీలు,నిరసనలు,లేఖలతో ముందుకు…

హైదరాబాదు: టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైనది. టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మళ్లీ సిట్టింగ్ లకే టిక్కెట్లు కేటాయించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాలో ర్యాలీలతో నిరసన తెలియజేశారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నుంచి రెబల్స్‌ సంఖ్య భారీగానే ఉండబోతోంది. పన్నెండు సీట్లకు గాను, అధిష్ఠానం పది సీట్లను ఖరా చేయగా.. టిక్కెట్లు దక్కనివారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. టిక్కెట్లు ఖరారు చేయని హుజుర్‌నగర్‌, కోదాడ స్థానాల్లోనూ ఎవరికివారు తమకే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.

నాగార్జున సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు టికెట్ ఇవ్వడాన్ని ఎంసి కోటి రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. అనుచరులతో సమావేశమైన కోటిరెడ్డి.. హాలియాలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నాన్‌లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు.

మహబాబ్ నగర్ లో రెబల్స్ బెడద టీఆర్ఎస్‌కు ఎక్కువగా ఉంది. షాద్ నగర్, కల్వకుర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ధిక్కార స్వరం గట్టిగా వినిపిస్తోంది. నారాయణపేటలో పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా.. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడాన్ని శివకుమార్ రెడ్డి తప్పుపట్టారు. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ర్యాలీ నిర్వహించారు. భూపాల్ రెడ్డి హఠావో..నారాయణ ఖేడ్ బచావో అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. దుబ్బాక, సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల్లోనూ ఆశావహులు.. రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఇక మానకొండూర్ టిక్కెట్ పై కూడా పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయికి టిక్కెట్ కేటాయించటంతో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రసమయికి వ్యతిరేకంగా స్థానిక నేతలు ర్యాలీ నిర్వహించారు. అధిష్ఠాన నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇద్దరు వ్యక్తులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు.

అటు బాల్కొండలో టిక్కెట్ ఆశించి భంగపడిన సునీల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబెల్ గా బరిలోకి దిగే అంశాలను పరిశీలిస్తున్నారు. తన భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సునీల్ రెడ్డి తన అనుచరులతో భేటీ అయ్యారు.

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టిక్కెట్‌ ఆశించి భంగపడిన సీనియర్‌ నేత కే ఎస్‌ రత్నం.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ మారతారనే ప్రచారం జరిగినా.. రత్నం దాన్ని కొట్టిపారేశారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతానని స్పష్టం చేశారు.

అటు పరిగిలో కూడా అసంతృప్త రాగం వినబడుతోంది. కొప్పుల మహేశ్వర్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన నాగేందర్‌గౌడ్‌, బయ్యాని మనోహర్‌రెడ్డి.. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెబల్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మధిర టిక్కెట్‌ను కమల్‌రాజ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ రాంబాబు ర్యాలీ నిర్వహించారు. మరో ఆశావహుడు బొమ్మెర రామ్మూర్తి ఆవేదన సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైరా సీటును మదన్‌లాల్‌కు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలంటూ.. ఐదు మండలాలకు చెందిన కార్యకర్తలు సమావేశమై తీర్మానం చేశారు. తీర్మానం ప్రతిని కేసీఆర్‌కు పంపారు.

Please follow and like us:

You may also like...