చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్…!

ధర్మాబాదు/అమరావతి/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది.

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదైంది.

ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు.

కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.

మరోవైపు కేసుపై సీఎం చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు.

చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.

మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.

తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్‌కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

అయినప్పటికీ తాము బాబ్లీ ప్రాజెక్టును సందర్శించాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టడం, ముందుకు చొచ్చుకు వెళ్లడంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.

చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలపై జరిగిన లాఠీ ఛార్జిలో అనేక మంది గాయపడ్డారు.

అనంతరం చంద్రబాబుతో సహా అందర్నీ అదుపులోకి తీసుకుని ఓ ఐటీఐ కాలేజీలో నిర్భందించారు.

ఈ సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

చంద్రబాబు పై కేసులు నమోదు చేయడంతో బెయిల్ తీసుకోవాలని అక్కడి పోలీసులు కోరగా, బెయిల్ తీసుకునేందుకు నిరాకరించారు.

తర్వాత చంద్రబాబును విమానం ఎక్కించి బలవంతంగా హైదరాబాద్‌కు పంపారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి.

ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది.

ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు.

Please follow and like us:

You may also like...