Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గళమెత్తిన కేరళ మహిళ….!

కేరళలో వేలాది మంది ధర్నా.. మేం అయ్యప్ప గుడిలోకి వెళ్లం వెళ్లరాదని మా భర్తల దీక్ష సమయంలోనే మేమూ దీక్ష పట్టాం, రాజ్యాంగానికి శతాబ్దాల పూర్వమే సంప్రదాయాలున్నాయ్‌రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి: రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌రాజకీయాలకు అతీతంగా తరలివచ్చిన మహిళలు, యువతతిరువనంతపురంలో మహిళ ఆత్మహత్యాయత్నంఅయ్యప్ప ధర్మ సంరక్షణ సేన పేరిట మానవహారాలు

తిరువనంతపురం/పందళం, అక్టోబరు 3 : పందళం… కేరళలోని చిన్న పట్టణం.. నాటి ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోని కీలక భాగం…. అంతేకాదు… సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రం శబరిమలతో విడదీయరాని అనుబంధం ఉన్న ఊరు. అయ్యప్ప స్వామి ఆభరణాలను భద్రపరిచేది పందళంలోని వాలియకోయికల్‌ దేవాలయం దగ్గరే… మకరజ్యోతి సమయంలో ఈ నగలను ఊరేగింపుగా శబరిమలకు తీసుకువెళతారు. అంతటి పవిత్ర క్షేత్రంలో మంగళవారం ఓ భారీ నిరసన ర్యాలీ జరిగింది. శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలను సైతం అనుమతించడాన్ని నిరసిస్తూ ఆ ర్యాలీ. ఉదయం 9: 30 గంటల వేళ సుమారు 4000 మంది భక్తులు ఆ వూళ్లోని మెడికల్‌ మిషన్‌ జంక్షన్‌లో గుమిగూడారు. అయ్యప్ప భజనలు ఆరంభించారు. క్రమేణా ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల వేళకు అది కాస్తా 4వేలకు పెరిగింది.. మరో రెండు గంటలు గడిచేసరికి అది కాస్తా 50వేలు దాటింది.. ఆ తరువాత ఊరు ఊరంతా కదిలివచ్చింది. సమీప గ్రామాలు, ఆఖరికి శబరిమల నుంచి కూడా ప్రజలు వచ్చి చేరారు.

అందరి నోటా ఒకటే మాట… సుప్రీంకోర్టు కొద్దిరోజుల కిందట ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలని..! దీనిపై రివ్యూ పిటిషన్‌ వేయాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నినాదాలు.. ఆలయ సంప్రదాయాలను నిర్దేశించేది భక్తులే రాజ్యాంగం కంటే శతాబ్దాల ముందే ఆలయ ఆచారాలు ఏర్పడ్డాయి.. సంస్కృతిని ధ్వంసం చేయొద్దు… సదాచారాలను కాలరాయొద్దు… అంటూ నినాదాలు!! విశేషమేమంటే సుప్రీం తీర్పును మహిళలు, యువత తీవ్రంగా వ్యతిరేకించడం. ‘అయ్యప్ప ధర్మ సంరక్షణ’ పేరిట చేయీ చేయీ కలిపి మానవహారాలుగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. దీనికి స్వయంగా పందళం రాజకుటుంబం నాయకత్వం వహించడం గమనార్హం. అయ్యప్ప ధర్మ సేన పేరిట ఓ హిందూ కార్యకర్తల కార్యాచరణ సమితి కూడా ఏర్పాటయింది. రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ‘మేం 50 ఏళ్లు వచ్చే వరకు ఆలయంలోకి వెళ్లకుండా ఉండేందుకు సిద్ధమే’నంటూ ప్లకార్డులు ప్రదర్శించి వారు భారీ ర్యాలీలు చేపట్టారు. హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి కంటే సుప్రీం తీర్పు గొప్పది కాదంటూ నినదించారు. 10-50 మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో పట్టణ వీధులన్నీ అయ్యప్ప నినాదాలతో మార్మోగాయి.

‘మేం ఆలయానికి వెళ్లాలనుకోవడం లేదు. అందుకు ప్రతిజ్ఞ కూడా చేశాం. తీర్పు మమ్మల్ని నిరాశకు గురి చేసింది. మానసికంగానూ ఒత్తిడికి గురయ్యాం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మేం కోరుకోవడం లేదు. హిందువులంతా మాకు మద్దతు ఇవ్వాలి’ అని మహిళలు స్పష్టం చేశారు. తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక.. కొల్లాం, అలప్పుళ, కోచి, పంబా, పలక్కాడ్‌, రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కిల్లిపాలెంలోనూ నిరసనకారులు రోడ్లను స్తంభింపజేశారు.

తిరువనంతపురంలో ఇడుక్కికి చెందిన అంబిలి అనే మహిళ.. తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా, ఢిల్లీలోనూ కేరళకు చెందిన పలు సంఘాలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టాయి. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేరళలో రాజకీయ పక్షాల మధ్య పోరుకు కారణమైంది. ఈ తీర్పుపై ఇప్పటికే అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు వామపక్షాలు, మితవాద నేతలు ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి

Please follow and like us:

You may also like...