Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కేసీఆర్ కు కో’దండం….!

ముందస్తు విఫల ప్రయోగం
కేసీఆర్‌ ఇలాంటి అవివేక వ్యూహమెలా చేశారా అనిపిస్తోంది..

తెరాస పాలనలో జనం గోస వినకుండా దర e్వాజలు బంద్‌
తెలంగాణ రావడం ఒక్క కేసీఆర్‌కే మేలైందనేది ప్రజల భావన
పైసలిచ్చేటోడు కాదు..

పనిచేసేటోడు కావాలంటున్నారు ప్రజలు
పార్టీ దెబ్బతినేలా పొత్తులుండవు.. ఉద్యమ ఆకాంక్షల సాధనే అజెండా
‘ఈనాడు’ ముఖాముఖిలో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం

కుటుంబ పెత్తనం.. గుత్తాధిపత్యంలో తెరాస ప్రభుత్వం నడుస్తోంది. ప్రజలకు రాజకీయాల్లో భాగస్వామ్యం, సంబంధాలు తెగిపోయాయి. ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇంత అవినీతి ఎన్నడూ చూసి ఉండలేదు. ప్రభుత్వం బలహీనమైపోయి ప్రజల్లో ఆదరణ కోల్పోయింది.

ఇది వరకు ఉద్యమకారులకు ఉన్నట్లు తెరాస పట్ల ఆదరణ కాని, గౌరవంగానీ లేదు.

ఇది తెలంగాణ ద్రోహుల నిలయంగా మారిపోయిందన్న భావన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధనకోసం మనం ప్రయత్నం చేయకపోతే ఏవి ఆశించి తెలంగాణ తెచ్చినమో దాని ఫలితాలు దక్కకపోతే..

ప్రయోజనం ఏందీ అన్నదే తెలంగాణ ప్రజల ఆలోచన. సాధారణ ప్రజల భాషలో చెప్పాలంటే మాకు ఇంకా తెలంగాణ రాలేదు.

ఒక్క కేసీఆర్‌కే వచ్చిందన్న భావన చాలా బలంగా ఉంది’
‘మా పార్టీలో కొత్తదనం ఉంది. బృంద స్ఫూర్తిని సాధించాం. లక్ష్యం పట్ల స్పష్టత ఏర్పడింది.

ఉద్యమకారులను రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇది మన వేదిక. గట్టిగా నిలబడి పోరాటం చేద
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం విఫల ప్రయోగమేనని తెలంగాణ జన సమితి(తెజస) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశాల్లేకుండా పోయాయనీ, ప్రజల మొర ఆలకించడానికి గడీల ధర్వాజలు బంద్‌ అయ్యాయని ధ్వజమెత్తారు. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికే మేలు జరిగిందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు.

తెజస ఏర్పడి కొద్ది నెలలే అయినా.. బలంగా నిలదొక్కుకుందనీ, తమది పంక్చరైన టైర్లతో కూడిన కారు కాదనీ, కొసదాకా గమ్యాన్ని ముద్దాడే వరకూ సమష్ఠిగా ముందుకు సాగే నిర్మాణం కూడిన బలమైన వ్యవస్థ అని స్పష్టంచేశారు. తమకు ఏదో రూపంలో పైసలిచ్చేటోడు కాదూ.. తమ సమస్యలను పరిష్కరించే పనిమంతుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ తమ పార్టీ నిర్మాణం పూర్తి అయిందనీ, ఇప్పటికే రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో పార్టీని వేగవంతంగా పటిష్ఠం చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా తమకు పొత్తులు ప్రధానమే అయినా..

ఆ పొత్తుల కారణంగా తమ పార్టీ బతుకును దెబ్బతీసే విధంగా నడచుకోలేమని తేల్చిచెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తెజస అవలంభిస్తున్న పాత్ర.. మహాకూటమిలో చేరిక..

ఎన్నికలకు సన్నద్ధతపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో ‘ఈనాడు’ ముఖాముఖి.

మీ పార్టీ పుట్టి నిండా ఆర్నేల్లు కూడా నిండలేదు..

ఈలోపే ఎన్నికలొచ్చాయి. ముందస్తు ఎన్నికలకు మీ సన్నద్ధత ఎలా ఉంది?
తెలంగాణ జన సమితి పుట్టకముందే మేమంతా రకరకాల రాజకీయ కార్యకలాపాలు, సామాజిక ఉద్యమాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్లం. అందుకే ఈరోజు తెజస పార్టీ ఏర్పడే నాటికే కొంత నిర్మాణంతో కూడి ఉంది. పుట్టిన తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో చాలా ఎదిగింది.

ఒక కొత్త పార్టీ మూణ్నాలుగు నెలల్లో ఎంత ఎదగగలదో అంతకంటే రెట్టింపు విజయం సాధించాం.

ఇప్పుడు ఎన్నికలు రావడంవల్ల మాకొచ్చే పెద్ద ఇబ్బందులు ఏమీ లేదు.
ఈరోజు ముందస్తు ఎన్నికలపై తెరాస చేస్తున్నది విఫల ప్రయోగమే. నిజంగా కేసీఆర్‌ గొప్ప నాయకుడని చాలామంది అంటుంటారు కానీ, చూస్తుంటే ఇంతటి అవివేకంతో ఆలోచించి వ్యూహం ఎలా తయారుచేశారా అనిపిస్తోంది. ఆయన మునగడంతో పాటు పార్టీనీ ముంచుతున్నారు.
తెజసలో మీరు మినహా ప్రజలను ప్రభావితం చేయగలిగే నాయకులెవరు లేరు కదా..?
పార్టీకి మండల, గ్రామ స్థాయిలో నిర్మాణం ఉంది. రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంది. దానికి మార్గదర్శకత్వం వహించడానికి కోర్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం.

ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయాలను పర్యవేక్షిస్తుంది. సమావేశ ఎజెండాను తయారు చేస్తుంది. ఎప్పటికప్పుడు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు సమావేశాలు కాకుండా ఎలాంటి నిర్ణయాలు చేయొద్దని నిర్ణయించాం.

ఉన్న నిర్మాణాలన్నీ క్రియాశీలంగా ఉన్నాయి. కాకపోతే వేగంగా ఇంకా చాలా ప్రాంతాల్లోకి, చాలా రంగాల్లోకి విస్తరించాల్సి ఉంది. అనుకున్నదానికంటే ఎన్నికలు ముందు రావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాని అవి అధిగమించలేని ఇబ్బందులు కాదు.

ఈ ఎన్నికలు రాకముందే 25 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను నియమించి నిర్మాణం, ప్రచారం మొదలు పెట్టాం. అక్కడ నిర్మాణం చాలా వేగంగా ఉంది. అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలున్నాయి. కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నారు.

విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. తర్వాత ఇంకొక 25 నియోజకవర్గాలు అనుకున్నాం. కార్యాచరణ సిద్ధమయింది. దసరా నాటికి 50 చోట్ల బలంగా నిలదొక్కుకోడానికి అవకాశం ఉంది.

కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐలతో పొత్తుల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు?
ఇప్పటికున్న పరిస్థితుల్లో ఒక్కళ్లమే ఉద్యమ సాధన చేయలేమని అనుకున్నప్పుడు.. ఆ ఉద్యమ ఆకాంక్షల అజెండాకు అంగీకరించి కలిసొచ్చే శక్తులను కలుపుకొనిపోవాలి. ఉద్యమ ఆకాంక్షల అజెండాను అంగీకరిస్తారా లేదా అనేదే ఏకైక ప్రాతిపదిక.

పొత్తులపై చర్చల్లో మీరెక్కువగా చొరవ చూపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది?
అన్నింటికీ నేనెందుకుపోతాను? పార్టీ ఉంది..

నాయకులున్నారు. ఆలోచనపరులు, వ్యూహకర్తలు ఉన్నారు. ఎవరికి వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు.

పంక్చరైన టైర్లతో కూడిన కారు కాదు మాది.. సమష్టిగా నిర్మించుకున్న ఒక వ్యవస్థ ప్రయాణమిది. అనేక దశలను దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. నలుగురితో కలిసి పోవాల్సి వస్తుంది. అలా పోవడానికి మేము సిగ్గుపడం. తెలంగాణ కోసం అందరం కలిసి పనిచేయలేదా? తెరాస ఒక్కటే చేసిందా? సర్వశక్తులు కలిసి ఐకాసగా మారితే కదా తెలంగాణ వచ్చింది.

కలవవలసిన సందర్భమొస్తే ఇతరపార్టీలతో కలుస్తాం. అంతమాత్రాన మాకు ఎదిగే శక్తే లేదు, మాకు ఇవాళ బలమే లేదు అనుకుంటే అది మూర్ఖపు ఆలోచన.

అమరుల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ఉండాలనే ప్రతిపాదన చేశారు. ఈ షరతులకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ ఒప్పుకుంటే.. సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా పొత్తుకు ఒప్పుకుంటారా?
అమరుల ఆకాంక్షల కోసం పనిచేయాలనే ఆలోచనను సూత్రరీత్యా అందరూ అంగీకరించారు. అలా అని పార్టీ బతుకును దెబ్బతీసే విధంగా పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఉండవు. ఎవరికీ టికెట్‌ వద్దు అనుకుంటే పార్టీ నడవదు.

పార్టీకి కూడా రాజకీయంగా గుర్తింపు ఉండాలి. భాగస్వామ్యం తగినంత ఉండాలి. పార్టీని కాపాడుకోవడానికి చేయవలసినవన్నీ చేయాలి. ఇవి నా దృష్టిలో చాలా కీలకం.

మీరు ఆశించిన సీట్లు రాకపోతే.. భాజపాతోగానీ, బీఎల్‌ఎఫ్‌తోగానీ జతకట్టే అవకాశాలున్నాయా?
ఒక ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిస్తే బాగుండదు. ఆ ప్రయత్నమేమైతదో చూద్దాం. మిగతా వాటి గురించి అప్పుడు ఆలోచిద్దాం.

పొత్తులుపెట్టుకున్నప్పుడు.. మీసీట్ల సంఖ్య తగ్గుతుంది కదా.. దీనివల్ల ఆశావాహుల్లో అసంతృప్తి చెలరేగే అవకాశాలు కూడా ఉంటాయేమో?
ఏ పార్టీకైనా ఇది కీలకం. తల్లి గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగాలనుకుంటుంది కదా..

మేమూ మాపార్టీఆరోగ్యంగా పెరగాలనే అనుకుంటాంగానీ.. దాన్నితుంచి, దాన్ని బలహీనపరిచి, పూర్తిగా ఎదగకుండా చేయాలని కూడా కోరుకోంకదా. అందుకని పొత్తుల్లోభాగంగా పార్టీని బతికించుకోవాలి. ఎదుగుదలకు పొత్తులుఉపయోగపడాలి.

తెరాస ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ, తెలంగాణ సాధన ఉద్యమంలో కొంత క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ.. రాష్ట్రం రాగానే ఆ పార్టీ తనను తాను మార్చుకుంది. మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పింది. ఎట్లన్నా చేసి అధికారంలో నిలబడాలి.

అధికారాన్ని సొంత అవసరాలకు వాడుకోవాలనే ఆలోచనలోకి వచ్చింది.
మీరు ఒంటరిగా పోటీ చేస్తే.. తెరాస వ్యతిరేక ఓట్లను చీల్చి చివరకు అధికార పార్టీకే ఉపయోగపడతారనే విమర్శలున్నాయి?
కేవలం ఒక పార్టీని దించడానికో..

ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నింటినీ ఒకచోట కూడగట్టడానికో జరిగే ఐక్యతకాదిది. కొన్నిపార్టీలు కలిసినంత మాత్రాన ఓట్లు ఐక్యమవుతాయని నేననుకోవడం లేదు. చాలా కీలకమేందంటే.. ఒక లక్ష్య సాధన కోసం ఉమ్మడిగా ప్రయత్నం చేసినప్పుడే ప్రజలు సంఘటితంగా నిలబడే అవకాశముంది. ఆ లక్ష్య సాధన కోసం ప్రయాణమే కీలకమవుతుంది. దాన్నే ప్రధానం చేసుకున్నప్పుడు ఐక్యత సాధించడానికి వీలవుతుందని నేను నమ్ముతున్నాను.

కేసీఆర్‌ తయారుచేసిన అనేకమంది నాయకుల్లో కోదండరాం ఒకరని తెరాస నేతలు విమర్శిస్తున్నారు.. దీనిపై స్పందన ఏమిటి?
ఒక మనిషి మరో మనిషిని పూర్తిగా తీర్చిదిద్దగలడదనేది సరైన ఆలోచన కాదు. ప్రతి మనిషికి స్వతహాగా పరిణామక్రమంలో సామాజిక ఎదుగుదల, స్థాయి ఉంటాయి. ఆ ఎదుగుదలకు ఎవరైనా సహకరించగలరు. స్వతహాగా లేకుండానే..

ఇంకొక మనిషి వల్లనే తయారైండు అనే ఆలోచనే లోపభూయిష్టమైనది. పదే పదే అలా మాట్లాడడమనేది ఎదుటివారిని అవమానపర్చడమేగానీ మరోటి కాదు.

కోదండరాం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదు. ప్రజాబలం లేదు. అందుకే రెండు మూడు సీట్లిచ్చినా చాలనేలా కాంగ్రెస్‌ వెంటబడుతున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు?
తెలంగాణలో మార్పు కోసం మాకు ఒక నిబద్ధత ఉంది. అందుకోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే తపన ఉంది. ఈ పని చేసే క్రమంలో ఎప్పటికప్పుడూ ఎదుగుతుంటం. రాజకీయాలే వద్దనుకున్నవాళ్లం.. తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఒక పార్టీగా మారినవాళ్లం ఇప్పుడు నిలదొక్కుకున్నం.

మాకు ఎదగగల శక్తి ఉందని నిరూపించుకున్నం. కచ్చితంగా మార్పు తేగల శక్తి మాకుంది. ఆ దిశగా గమ్యాన్ని చేరతామనే విశ్వాసం మాకుంది.

ఎన్నికల్లో ప్రధానంగా ఏయే అంశాలను ప్రచారాస్త్రాలుగా ప్రయోగించనున్నారు?
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతి పైసా ప్రజలకే దక్కాలి. ఈ మార్పును తీసుకురావడానికి మేం పనిచేస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆలోచనలు మారాయి.

ప్రభుత్వం బాగా పనిచేయాలని వారి మనసులో పడింది. పైసలిచ్చేవాడు కాదు.. పనిచేసేటోడు కావాలని ఇవాళ ప్రజల్లో అవగాహన వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని ఎంతమేరకు సాధిస్తామనేది పక్కనబెడితే ఒక ప్రయాణమైతే ప్రారంభమైంది.

ఒక్క తెరాస అధినాయకత్వమే కాదు. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మంచో చెడో చెప్పుకోడానికి ఈ ప్రభుత్వంలో అవకాశం ఉంటుందని ప్రజలు అనుకున్నారు. కానీ నేడు అన్ని దర్వాజలు బంద్‌ అయ్యాయి. ఏం చెప్పుకుందామన్నా వినే వారెవరూ లేరు.

ఉద్యమ సంస్థను నడపడంలోనూ.. రాజకీయ పార్టీని నడిపే విషయంలోనూ మీరు గమనించిన తేడా ఏమిటి?
మేం బయట ఉన్నప్పుడు.. ప్రచారం చేసినప్పుడు గెలిపించాలనే తాపత్రయం.. అది ప్రజలకు ఎలానచ్చజెప్పాలనేది ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక పార్టీగా నిలదొక్కు కోవాలి.. గెలవాలన్నప్పుడు.. ఇది ఒక సమరంలాంటిది. ఒక క్రికెట్‌పోటీ వంటిదే. బౌలింగ్‌ చేస్తూనే ఉంటారు. బౌలర్‌ చాలా సంక్లిష్టంగా బాల్‌తిప్పుతున్నడు.. ఊహించని విధంగా గూగ్లీలు పడుతున్నాయి. స్పిన్‌ బాగా తిరుగుతోంది. నేనేమీ చేయలేనంటే కుదరదు. ఇక్కడ మైదానంలో ఉన్నావు. నిలదొక్కుకోవాల్సిందే. నిలదొక్కుకోవడమే కాదు.. ప్రత్యర్థిపై పైచేయి సాధించవల్సిందే. పరిస్థితిని ఎదుర్కొనవల్సిందే. ఉద్యమాల్లో తిరిగి ఉన్నాం కాబట్టి ఆ అనుభవాలు కొంత ఇక్కడ ఉపయోగపడుతున్నాయి.

జాతీయ రాజకీయాలపట్ల తెజస వైఖరి ఏమిటి? భాజపా, కాంగ్రెస్‌ కూటములను మీరు ఎలా చూస్తున్నారు?
తెలంగాణలో ఆర్థిక రంగాన్ని పునరుజ్జీవింప చేయాలి. దీనికి ఎవరు సహకరిస్తే వారికే మద్దతు.

Please follow and like us:

You may also like...