కావాలనే నాపై ఐటి దాడులు..సిఎం రమేష్..!

హైదరాబాద్/అమరావతి: తన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాలలోని సోదాలపై తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. తాను తల తీసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. భయాందోళనలు సృష్టించాలనే ఈ దాడులు అన్నారు. రాజకీయంగా తనను అబాసుపాలు చేయాలని కుట్ర చేశారన్నారు.
బెంగళూరు, కడప, చెన్నై, ఢిల్లీలతో పాటు తన గ్రామంలోని ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించిందని తెలిపారు. ఐటీ ఆధికారులు దాడి చేయడంలో తప్పులేదని, వారికి ఆ హక్కు ఉందని, కానీ ఇక్కడ జరిగింది, కేవలం రాజకీయ కక్ష అన్నారు. రాజకీయ కక్షతో ప్రతిపక్షాల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

తాను సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు (మీడియా) వచ్చానని సీఎం రమేష్ తెలిపారు. నా వ్యాపారాలతో సంబంధం లేని వారి ఇళ్లు, కార్యాలయాలలోను తనిఖీలు చేశారన్నారు. నా స్నేహితులను కూడా వదిలి పెట్టకపోవడం దారుణం అన్నారు. రాజకీయ కక్షతో ఐటీ దాడులు చేయడం దారుణం అన్నారు. తప్పు చేయనప్పుడు తాను ఎందుకు భయపడాలి, ఐటీ సోదాలు చేసుకోనివ్వాలని, ఆధారాలతో తాను మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
తన భార్యను కంపెనీ డైరెక్టర్ అని ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, కానీ అసలు ఆమె డైరెక్టర్ కాదు కదా.. కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని సీఎం రమేష్ అన్నారు. రిత్విక్ అగ్రిఫామ్స్‌లో తన భార్య డైరెక్టర్ కాదన్నారు. ఒక తప్పుడు కంపెనీ పేరుతో వారెంట్ తీసుకొని వచ్చారని వాపోయారు. తన ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయని చెప్పారు. బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనుసోధాలు చేశారన్నారు.

తమ మీద పై నుంచి ఒత్తిడి ఉందని ఐటీ అధికారులు తమతో చెప్పాలని సీఎం రమేష్ అన్నారు. తాము భయపడకుండా సోదాలకు అంగీకరించామని అన్నారు. సోదాలకు కారణాలు చెప్పమని అడిగితే, సోదాలకు వచ్చామని మాత్రమే చెప్పారని వాపోయారు. సమాచారం లేకుండా హడావుడిగా సోదాలు నిర్వహించారన్నారు. పంచనామా ముగిశాకే మీడియా ముందకు వచ్చానని అన్నారు.

ఆరేళ్ల క్రితం ఖాళీ చేసిన ఢిల్లీ కార్యాలయంలోను సోదాలు చేశారని సీఎం రమేష్ చెప్పారు. మూడేళ్ల క్రితం ఖాళీ చేసిన బెంగళూరు కార్యాలయంలోను సోదాలు నిర్వహించారని ఆరోపించారు. మా కంపెనీ నుంచి వేలాది కోట్లు తరలిపోయినట్లు రాశారని, అసలు మా కంపెనీ టర్నోవరే వెయ్యి కోట్ల రూపాయలు లేదని చెప్పారు. మూడ్రోజుల పాటు సోదాలు నిర్వహించారన్నారు. మా ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదన్నారు. అలహాబాద్‌లో మాకు ఎలాంటి అకౌంట్లు లేవని చెప్పారు. బ్యాంకు అకౌంట్లు కీలక పత్రాలు అవుతాయా అన్నారు.
నామినేషన్ పద్ధతిలో దక్కించుకుంటే సవాల్
తమది ఇరవై సంవత్సరాల కంపెనీ అని, అప్పటి నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నామని సీఎం రమేష్ తెలిపారు. రిత్విక్ సంస్థకు ఈ నాలుగున్నరేళ్లలో నామినేషన్ పద్ధతిలో రూ.2 వేల కోట్ల పనులు, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చాయని కొందరు చెబుతున్నారని, కానీ టెండర్‌లో కాకుండా కనీసం ఒక్క లక్ష రూపాయలను అయినా తాను నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్నా ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. నామినేషన్ పద్ధతిలో తాను కనీసం ఒక్క రూపాయి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు నిరూపిస్తారా అని సవాల్ చేశారు.

దేవుడి ముడుపులు కూడా స్వాధీనం ప్రభుత్వం జీవో ప్రకారం, ఆర్డర్ ప్రకారం రూ.5 లక్షలకు పైగా టెండర్ కావాలంటే నామినేషన్ పద్ధతి లేదని, మరి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉంటే తనకు తెలియదని సీఎం రమేష్ సెటైర్ వేశారు. మిథున్ రెడ్డికి చెందిన కంపెనీలు వ్యాపారం చేయవచ్చు కానీ, మేం చేయవద్దా అని ప్రశ్నించారు. తన ఇంట్లో రూ.3.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని, అందులో రూ.2 లక్షలు దేవుడి ముడుపులే ఉన్నాయని చెప్పారు.

దానికి బహుమానంగా ఐటీ దాడులు తాను రాజకీయంగా పలు అంశాలపై పోరాడుతున్నానని సీఎం రమేష్ చెప్పారు. ఏపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో ఎక్కడెక్కడ ఐటీ దాడులు చేస్తున్నారు, ఏం దొరికిందనే సమాచారాన్ని తాను సేకరించే ప్రయత్నాలు చేశానని, దానికి బహుమానంగా తనపై ఐటీ దాడులు చేశారని మండిపడ్డారు. అలాగే పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకు తనపై ఐటీ దాడులు చేశారన్నారు. నా వద్ద, నా భార్య వద్ద మాట్లాడే ధైర్యం లేక ఆఫీసుకు వెళ్లి అక్కడ ఉద్యోగులను వేధిస్తున్నారన్నారు. ఐటీ అధికారులపై సీఎం రమేష్ సంచలనం ఈ సందర్భంగా సీఎం రమేష్ ఐటీ ఆధికారులు తనకు చెప్పారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే ఐటీ దాడులు జరుగుతాయని మీ పెద్దలకు చెప్పండని ఐటీ ఆధికారులు తనతో చెప్పారని బాంబు పేల్చారు. తద్వారా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడుకు చెప్పాలని ఆ మాటల్లోని అర్థంగా కనిపిస్తోంది. పైనుంచి ఒత్తిడి ఉందని అధికారులు చెప్పారని కూడా తెలిపారు. ఐటీ సోదాలపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నా తల తీసినా పోరాడుతానని అన్నారు. నేను పోయినా నా కుటుంబ సభ్యులు పోరాడుతారన్నారు.

Please follow and like us:

You may also like...