Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎఫ్.ఐ.ఆర్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఇక అందరికీ అందుబాటులో ప్రథమ సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) వుండబోతోంది. ఎఫ్ఐఆర్ రిపోర్టును 24 గంటల్లోగా పోలీసు అఫీషియల్ వెబ్సైట్లో గాని, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో గాని వుంచాలని, 2016 నవంబరు 15 నుంచి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఎఫ్ఐఆర్ కాపీ పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని, సుప్రీంకోర్టు యూత్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసులో 2016 సెప్టెంబరు 7న పేర్కొంది.

ప్రథమ సమాచార నివేదిక త్వరితగతిన పొందుటకు కోర్టు నుంచి, పోలీసుల నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేయటానికి అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసిన 24 గంటల్లో పోలీసు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

పోలీసు అఫీషియల్ వెబ్సైట్ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో లోడ్ చేయాలి.

అప్లోడ్ చేసిన ప్రథమ సమాచార నివేదికను ఎవరైనా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పించాలి.

భౌగోళిక పరిస్థితుల వల్ల ఇంటర్నెట్ కనెక్టవిటీ ఇబ్బందులు ఉన్నప్పుడు 48 నుంచి 72 గంటల లోపు ప్రథమ సమాచార నివేదికను అప్లోడ్ చేయాలి.

మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు, టెర్రరిస్ట్ నేరాలు, బాలబాలికలపై లైంగిక వేధింపుల నేరాలు, సున్నిత స్వభావం, వ్యక్తి ఏకాగ్రతను భంగపరిచే కేసులలో ప్రథమ సమాచార నివేదిక అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

సున్నితమైన, వ్యక్తి స్వేచ్ఛను భంగపరిచే నేరాలు ఏవి అని నిర్ణయించే అధికారం కాంపిటెంట్ అధికారికి ఉంటుంది.

ప్రథమ సమాచార నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయదగినది కాదనే నిర్ణయం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు తక్కువ కాని స్థాయి అధికారి కాని జిల్లా మెజిస్ర్టేట్ కాని నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని పోలీసు అధికారి సంబంధిత కోర్టుకు సమాచారం ఇవ్వాలి.

ప్రథమ సమాచార రిపోర్టును అప్లోడ్ చేయకూడదని తీసుకొన్న నిర్ణయాన్ని, ఎవరికయినా ఇబ్బంది కలిగినప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు లేదా కమిషనర్ ఆఫ్ పోలీసుకు అర్జీ దాఖలు చేసుకోవచ్చు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు లేక కమిషనర్ ఆఫ్ పోలీసు అర్జీ అందిన మూడు రోజులలో ముగ్గురు అధికారులతో కమిటీ వేయాలి. త్రిసభ్య కమిటీ 8 వారాలలో నిర్ణయం తీసుకుని అ ర్జీదారులకు సమాచారం ఇవ్వాలి.

సున్నితమైన నేరాలు, వ్యక్తి ఏకాంతతకు భంగం కలిగించే సంబంధించిన సమాచార ప్రథమ సమాచార నివేదిక అప్లోడ్ చేయనప్పుడు కోర్టులో నకలుకు అర్జీ దాఖలు చేసినప్పుడు మూడు రోజుల్లోగా కోర్టు ఇవ్వాలి.

ప్రథమ సమాచార నివేదిక వె బ్సైట్లో అప్లోడ్ చేయలేదనే నెపంతో నేరస్థునికి కోర్టులు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలులేదు.

నిందితుడు నమోదు పత్రం దాఖలు చేసిన తరువాత 207 సీఆర్పీసీ కింద కోర్టు నుంచి ఉచితంగా పొందే అవకాశానికి ముందే ప్రథమ సమాచార నివేదికను పోలీసు వారు రిజిస్టర్ చేసిన వెంటనే నకలు పొందవచ్చు.

నిందితుడు కాని, అతనికి సంబంధించిన వ్యక్తి కాని నిర్ణయించిన రుసుమును చెల్లించి పోలీసు ఆఫీసర్ను గాని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారిని గాని ప్రథమ సమాచార నివేదిక నకలు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పోలీసు అధికారి 24 గంటలలో నకలు కాపీ ఇవ్వాలి.

ప్రథమ సమాచార నివేదికను మెజిస్ర్టేట్ కోర్టుకు కాని, స్పెషల్ కోర్టుకు పంపించాక, నిందితుడు కోర్టులో నకలు దరఖాస్తు చేసుకున్నప్పుడు కోర్టు ప్రథమ సమాచార నివేదిక నకలును రెండు రోజులలోపు ఇవ్వాలి.

Please follow and like us:

You may also like...