Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఇక సెలవు….అటల్ బిహారీ వాజ్ పేయి…

గంజాయి తోటల్లో ఓ తులసి మొక్క…!

ప్రత్యర్థులు సైతం ‘రియల్ స్టేట్స్‌ మన్’ అని ప్రశంసించే వ్యక్తిత్వం… మంచి వక్త, మంచి కవి, మంచి మనిషి, మంచి పాలకుడు… నిజానికి మంచి ప్రత్యర్థి..! అందుకే ఆయన ఓ అజాతశత్రు… పెళ్లీ గిళ్లీ వదిలేసి, జీవితం మొత్తాన్ని దేశానికే అంకితం చేసి, మన దేశ క్షుద్ర రాజకీయాల్లోనూ కొన్ని విలువలతో వెలిగిన ఓ తులసి మొక్క వాజ్‌పేయి…! చివరకు బీజేపీ భావజాలాన్ని విపరీతంగా ద్వేషించే ఇతర పార్టీల నేతలు సైతం ‘తప్పుడు పార్టీలో ఒకే ఒక ఒప్పుడు మనిషి’ అన్నారే తప్ప వాజ్‌పేయిని వ్యక్తిగతంగా నిందించలేదు… అదీ అటల్ బిహారీ వాజ్‌పేయి…! జయలలిత వంటి ఓ మహిళా నియంత తన సర్కారును కూలదోస్తే, హుందాగా పీఎం పోస్టును గడ్డిపోచగా వదిలేశాడే తప్ప ఎంపీల కొనుగోలుకు ప్రయత్నించలేదు.., 13 రోజుల్లో సర్కారు కూలిపోయినా, 13 నెలల్లో మరోసారి సర్కారు కూలిపోయినా సరే ఏ ప్రలోభాలకు తెరతీయలేదు… ఈరోజు తెల్లారి లేస్తే పదుల సంఖ్యలో ఎంపీల   విక్రయాలు సాగుతున్న విషయం దేశ వాసులకు తెలిసిన విషయమే

నమ్మిన మిత్రులు తన సర్కారుతో ఆడుకున్నా, చిరునవ్వుతో క్షమించేశాడు కానీ ఏ ఒక్కరోజూ నిందించే పనిలోపడలేదు… చివరకు తను చాచిన స్నేహహస్తాన్ని పాకిస్థానీ సర్కారు అడ్డంగా నరికేసి, ఆ నమ్మకాన్ని భూమిలోపాతేసినా, కార్గిల్‌లో మారణహోమానికి తెగబడినా, అదే నవ్వుతో సమరాన్ని నడిపించాడు తప్ప బీరువై కుంగిపోలేదు… బంగ్లా విముక్తి తరువాత తన ప్రత్యర్థి ఇందిరను దుర్గ అని కీర్తించడం ఒక వాజ్‌పేయికే చెల్లింది… పీవీ అడిగిందే తడవుగా, భారతీయ దళానికి నాయకత్వం వహించి, ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ నాటకాల్ని బట్టబయలు చేసినా ఆయనకు మాత్రమే చెల్లింది… అమెరికాలు, దాని దోస్తులు కన్నెర్ర చేస్తున్నా సరే, ఫోఫోవోయ్ అని ధిక్కరించి హైడ్రోజన్ బాంబుల్ని పరీక్షించి, కాలరెగరేయడం కూడా తనకే చెల్లింది… ఇలా బోలెడు చెల్లుబాట్లు తన రాజకీయ జీవితంలో… ఇవి కొన్ని, కేవలం కొన్ని మాత్రమే… ఇప్పటి కుక్క మూతిపిందెలకు ఆయన ఎప్పుడూ ఓ ఆశ్చర్యమే… అవును… అటల్ బిహారీ వాజ్‌పేయి అంటే… ఓ అరుదైన కేరక్టర్… అంతే…
వాజ్‌పేయి పుట్టింది గ్వాలియర్‌లో..! పుట్టింది 1924… అంటే 94 ఏళ్లు…పూర్తి స్థాయిలో  దేశాన్ని పాలించిన కాంగ్రెసేతర తొలి ప్రధాని ఆయన…సరస్వతి శిశుమందిర్‌‌లో చదువుకున్నాడు… పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణుడు…హిందీ, ఇంగ్లిషు, సంస్కృతం భాషల్లో పట్టభద్రుడు…ఆర్యసమాజ్‌కు చెందిన ఆర్యకుమార్ సభతో తన యాక్టివిటీ ప్రారంభించిన ఆయన వెనుతిరిగి చూడలేదు.

15 ఏళ్ల వయస్సు నుంచీ ఇప్పటిదాకా తను స్వయం సేవక్ గా పూర్తిస్థాయిలో సేవలు అందించిన ఘనత వారికే దక్కిందని మహామహులు చెబుతుంటారు.అంటే వారు దాదాపు 8 దశాబ్దాల పాటు స్వయం సేవక్ నిర్విరామంగా వారి సేవలు అందించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.1947 దేశవిభజన అల్లర్ల కారణంగా తను న్యాయవిద్యను మధ్యలో వదిలేశాడు… విస్తారక్‌గా రాష్ట్రాలు తిరిగేవాడు…దీనదయాళ్ ఉపాధ్యాయ, రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర అర్జున్ వంటి వార, దినపత్రికల్లో పనిచేశాడు…క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజులు జైలుజీవితం గడిపాడు తొలిసారిగా…ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురయ్యాక, భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి, దీనదయాళ్‌తోపాటు వాజ్‌పేయికి కూడా పార్టీ బాధ్యతల్ని అప్పగించింది సంఘ్… అంటే బీజేపీ మాతృపార్టీ జనసంఘ్ వ్యవస్థాపక నేతల్లో ఒకడు… 1968లోనే దానికి జాతీయ అధ్యక్షుడయ్యాడు…ఎమర్జెన్సీ పిరియడ్‌లో అరెస్టయి నెలల కొద్దీ జైలులో ఉన్నాడు… జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని జనతాలో కలిసిపోయింది జనసంఘ్…1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు… దానికి జాతీయ అధ్యక్షుడు వాజ్‌పేయి…మొదటి నుంచీ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా వాజ్‌పేయినే జనం ముందు నిలిపేది…1996లో మంచి ఫలితాలు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ… ప్రభుత్వం ఏర్పాటు చేసి, 13 రోజుల్లోనే అధికారాన్ని పోగొట్టుకున్నాడు…1998లో మరోసారి సర్కారు ఏర్పాటు… ఈసారి 13 నెలల దాకా ప్రభుత్వం నడిచింది…పోఖ్రాన్ అణుపరీక్ష, పాకిస్థాన్‌తో సత్సంబంధాల కోసం బస్సుయాత్రలు, ఆగ్రా చర్చలు వంటి బోలెడు చర్యలు..కానీ కార్గిల్ యుద్ధంతో పాకిస్థాన్ చేయిచ్చింది… అదే వాజ్‌పేయీ అంటే… శాంతికీ సై, కాదంటే సమరానికీ సై అన్నాడు…1999లో ఎన్డీయే ఏర్పాటు, ఈసారి ఫుల్ టరమ్ ప్రధానిగా కొనసాగాడు…1999 డిసెంబరులో అల్ ఖైదా ఉగ్రవాదులు ఓ విమానాన్ని హైజాక్ చేస్తే, నిర్బంధితులను విడుదల చేయించటానికి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు…2001లో పార్లమెంటుపై దాడి, 2002లో గుజరాత్ అల్లర్లు… ఒక దశలో మోడీని సీఎంగా తొలగించాలని భావించాడు వాజ్‌పేయి… అనేక సంక్షోభాల్ని ఎదుర్కొంటూనే ఆర్థిక సరళీకరణను కొనసాగించింది తన సర్కారు… విదేశీ విధానానికి కొత్తరూపు ఇచ్చాడు…2005 నుంచి తన క్రియాశీల రాజకీయాలకు స్వస్తి…తరువాత గుండెపోటు… మనుషుల్ని కూడా గుర్తించలేని ఓ రకమైన చిత్తవ్యాధి డైమెన్షియాకు గురయ్యాడు… చాలా ఏళ్లుగా ఇంటికే పరిమితం…నమిత… ఆయన దత్త కూతురు… కాన్పూర్‌లో లా చదివినప్పుడు, తండ్రి తను సహాధ్యాయులు… ఒక గదిలో ఉండి చదువుకునేవాళ్లు…1977లో విదేశాంగమంత్రిగా తన ఆఫీసుకు వెళ్లగానే, నెహ్రూ చిత్రపటం తీసేయబడిందని గుర్తించి, అర్జెంటుగా ఆ ఫోటో పెట్టాలని ఆదేశించాడు… రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అనేది వాజ్‌పేయి నమ్మిన పాలసీ…47 సంవత్సరాల పార్లమెంటేరియన్… 11 సార్లు లోక్‌సభ ఎంపీ, రెండుసార్లు రాజ్యసభ ఎంపీ… 2015లో ఇండియా అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అందుకున్న నాయకుడు… నిజంగానే ఓ భారతరత్నం…!

Please follow and like us:

You may also like...