ఆయిల్‌ బాండ్లపై బాకీ చెల్లింపు అబద్ధమా…?

  • రూ 2లక్షల కోట్లు చెల్లించాం ధర్మేంద్ర ప్రధాన్‌…
  • కాదు చెల్లించింది రూ 40,000 కోట్లే  పెట్రోలియం శాఖ…
  • ఇందులో అసలు రూ 3, 500 కోట్లే…
  • పెండింగ్‌ బాండ్ల మెచ్యూర్‌ 2021-26 మధ్యలో!
  • 2026 బిల్లు కూడా చెల్లించినట్లు ప్రకటనలు

చమురు బాండ్ల బాకీ చెల్లింపులో ఎన్‌డీయే ప్రభుత్వం అడ్డంగా అబద్ధమాడుతున్నట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘యూపీఏ హయాంలో తీసుకున్న చమురు బాండ్లకు సంబంధించి రూ.2లక్షల కోట్లు చెల్లించాం. నాటి ప్రభుత్వం 1.44లక్షల కోట్ల మేర బాండ్లు తీసుకుంది. ఈ అసలుతో పాటు మేం వీటిపై రూ. 70,000 కోట్ల మేర వడ్డీ చెల్లించాం. పెట్రోధరల పెరుగుదలకు కారణాల్లో ఇదీ ఒకటి’’ అని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పట్నాలో అన్నారు. అటు బీజేపీ కూడా ట్విటర్‌ ఇదే విషయాన్ని పేర్కొంటూ ఓ ఇన్‌ఫో గ్రాఫిక్‌ను పోస్ట్‌ చేసింది. అయితే.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు మాత్రం పెట్రోలియం శాఖ అందుకు భిన్నమైన సమాచారం ఇచ్చింది. ఎన్‌డీఏ ప్రభుత్వం కేవలం రూ 40,000 కోట్ల మేర ఆయిల్‌ బాండ్లను మాత్రమే తిరిగి చెల్లించిందని, ఇందులో కూడా రూ 3,500 కోట్లు అసలు అనీ, మిగిలిందంతా వడ్డీయేనని ఆ శాఖలో ఓ విభాగమైన పీపీఏసీ వెల్లడించినట్లు బూమ్‌ లైవ్‌, ఫ్యాక్ట్‌లీ అనే వెబ్‌సైట్లు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.

ఇంకా రూ 1.3 లక్షల కోట్ల మేర ఆయిల్‌ బాండ్ల బాకీ చెల్లించాల్సి ఉందని తెలిపాయి. సాధారణంగా 10-20 ఏళ్ల కాలానికి చమురు బాండ్లు మెచ్యూర్‌ అవుతాయి. వాజ్‌పేయి హయాంలో 2002-03 బడ్జెట్‌లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ ఆయిల్‌ బాండ్ల జారీ గురించిన ప్రస్తావన చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి ఉన్న మొత్తం బాండ్ల విలువ రూ 1.34లక్షల కోట్లు. మోదీ హయాంలో కేవలం రెండు బాండ్లు మాత్రమే మెచ్యూర్‌ అయ్యాయి. వాటిని మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన వాటికి వడ్డీ కట్టింది. ఇది ఏటేటా బడ్జెట్‌లో కేటాయించేదే. యూపీఏ హయాంలో అయితే ఐదేళ్ల కాలానికి ఏకంగా రూ 53వేల కోట్లు చెల్లించారు. మిగిలిన బాండ్లు 2021, 23, 24, 25, 2026 సంవత్సరాలకు గాని మెచ్యూర్‌ కావు. వాటి మొత్తం బాకీ విలువ రూ. 1.30లక్షల కోట్ల పైనే! ఆ మొత్తాన్ని ఇప్పుడే చెల్లించేసినట్లు కేంద్ర మంత్రే కాకుండా, బీజేపీ కూడా ప్రకటనలు గుప్పిస్తుండడం విశేషం..

Please follow and like us:

You may also like...