అందరు వెన్నుపోటు దారులే…..విజయశాంతి!

కేఎల్‌ఐని అడ్డుకున్నది కృష్ణారావే
కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచావ్‌
రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
కొల్లాపూర్‌ ప్రజాగ్రహ సభలో మండిపడ్డ భట్టి

కొల్లాపూర్‌ ర్యాలీలో సలీం, భట్టి, విజయశాంతి, అరుణ
‘ఎప్పుడో పూర్తి చేయాల్సిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డావు. సిగ్గు లేకుండా కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నావు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే కదా’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని రాజుగారి బంగ్లా సమీపంలో ఏర్పాటుచేసిన ప్రజాగ్రహ సభలో ఆయన ప్రసంగించారు. ‘ఎంజీ కేఎల్‌ఐ లిఫ్టు-1, లిఫ్టు-2 మధ్యలో కాల్వల తగ్గింపునకు పాల్పడ్డావు. సకాలంలో పూర్తి చేయాల్సిన పనికి అడ్డుపడి ఆపివేయించావు. కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచావ’ంటూ ఆయన విమర్శల బాణం ఎక్కు పెట్టారు. కొల్లాపూర్‌ ప్రజలు కన్నెర్ర చేసే రోజు వచ్చింది.. ఈ సారి ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారంటూ భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు.

  • కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో ఛైర్‌పర్సన్‌ డీకే అరుణ మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావుది తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే వ్యక్తిత్వమన్నారు. కొల్లాపూర్‌ అభివృద్ధికి మంత్రి చేసింది ఏమీ లేదన్నారు. ‘నాకంటే ఒక్కసారి ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలుగానే ఉన్నాయి. రోడ్లు వేయకుండానే బిల్లులు మింగారు. అప్పుడంటే ఆంధ్రోళ్లు ఉండి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఆరోపించావు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రే కదా.. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించదే’ అంటూ ఎద్దేవా చేశారు. జూనియర్‌ కళాశాలల ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలు, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కేఎల్‌ఐ నిర్మాణం ఇలా అన్ని అభివృద్ధి పనులు నాటి కాంగ్రెస్‌ పాలనలో చేసినవే ఉన్నాయన్నారు. ‘చీటికి మాటికి గద్వాల్‌ వస్తుంటే ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందోనని ఉహించుకున్నా. చివరకు ఏమీ జరగలేదని తెలుసుకున్నా అన్నారు. గతంలో తాను పాన్‌గల్‌ నుంచి జడ్పీటీసీకి పోటీ చేసినప్పుడు ఓడించేందుకు ప్రయత్నం చేసినా అక్కడున్న తన అన్నదమ్ములు ఆడబిడ్డగా భావించి గెలిపించారంటూ హర్షం వ్యక్తం చేశారు. ‘రాజకీయబిక్ష పెట్టింది నేనేనంటూ మంత్రి ఎలాగూ రేపు (శనివారం) నాపై విమర్శలు చేస్తాడు. ఆయన విమర్శించకముందే చెబుతున్నా.. నాకు రాజకీయబిక్ష పెట్టే స్థాయి మంత్రికి లేదు. నాది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం’ అని డీకే అరుణ పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో.. కాంగ్రెస్‌కో బిఠావో అన్న నినాదంతో ఎన్నికల ప్రచారం కొనసాగుతోందన్నారు. ఎంపీ నంది ఎల్లయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కేసీఆర్‌ ఒక్కడి సొత్తు కాదన్నారు. ప్రజాస్వామ్యం అంటే కొడుకు, కూతురు, అల్లుడికి అధికారం ఇవ్వడం కాదని.. ప్రజల కోసమని అన్నారు. సమావేశంలో పార్టీ ప్రచార తార విజయశాంతి కేసీఆర్‌ను లక్ష్యం చేసుకొని ప్రసంగించారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంఛార్జి హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు జగదీశ్వర్‌రావు, వెంకట్‌ పాల్గొన్నారు.
Please follow and like us:

You may also like...